‘ఆకాశం చూశావా ఎంత అందంగా ఉందో?’, ‘ఇదిగో ఈ పాట విను…’, ‘కలిసి ఒక కప్పు టీ తాగుదామా?’.. ఇలాంటి మాటలు సాధారణ సంభాషణలో భాగమే అనిపిస్తాయి. కానీ వ్యక్తిగత సంబంధాల నిపుణులు మాత్రం వీటిని అనుబంధానికి చిన్న ఆహ్వానాలుగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచప్రసిద్ధ సంబంధాల పరిశోధకుడు డాక్టర్ జాన్ గాట్మన్ వీటికి ‘బిడ్స్ ఫర్ కనెక్షన్’గా పేరు పెట్టారు. అంటే ‘నా అనుభూతిని నీతో పంచుకోవాలనుకుంటున్నాను’ అనే చిన్న ప్రయత్నం.
ఇలాంటి ఆహ్వానాలు ప్రేమికుల మధ్య మాత్రమే కాదు… భార్యాభర్తలు, తల్లిదండ్రులు-పిల్లలు, స్నేహితులు… ఇలా ఏ బంధంలోనైనా కనిపిస్తాయి. ‘ఈ వార్త చూడు’, ‘ఈ పువ్వు ఎంత అందంగా ఉంది’, ‘ఈ రోజు ఎలా గడిచింది?’… లాంటివన్నీ సమాచారం కోసం అడిగే ప్రశ్నలేం కావు. కానీ, ఎదుటి వ్యక్తికి మన ప్రపంచంలో భాగం ఉందని చెప్పే, ఒక భాగంగా చేసే ప్రయత్నాలు కూడా అంటారీయన.
డాక్టర్ గాట్ మన్ ఎన్నో దశాబ్దాలుగా వేలాది జంటల మీద చేసిన పరిశోధనల్లో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇలాంటి చిన్న ఆహ్వానాలను గుర్తించి సానుకూలంగా స్పందించే జంటలు దీర్ఘకాలంలో మరింత బలమైన బంధాన్ని కొనసాగించే అవకాశాలు ఎకువగా ఉన్నాయని ఆయన పేరొన్నారు. ప్రతి మాటకు పెద్ద సమాధానం అవసరం లేదు.
ఒక చిరునవ్వు, ఒక చూపు, ‘అవునా!’ అనే స్పందన కూడా చాలాసార్లు అనుబంధాన్ని మరింత గాఢం చేస్తుందట. వేగంగా మారుతున్న జీవితంలో పెద్ద పెద్ద సంభాషణలకు సమయం దొరకకపోవచ్చు. కానీ రోజులో ఇలాంటి చిన్న చిన్న క్షణాలు మాత్రం ఎన్నో వస్తుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా, స్పందిస్తూ ముందుకు సాగితే బంధాలు సహజంగానే బలపడతాయని సంబంధాల నిపుణులు సూచిస్తున్నారు.