కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఏదో విధంగా దక్కించుకోవాలని భావించిన కాంగ్రెస్ పార్టీకి భంగపాటు కాగా, అనిశ్చితపరిచే విధంగా కుట్రలు చేస్తున్నది. 13వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ విప్‌ను ధిక్కరించి చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వగా, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు నోటీసు జారీ చేయడం ఆందోళనకు గురిచేస్తున్నది. మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు యంత్రాం గం వత్తాసుపలుకుతూ అత్యుత్సాహం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తున్నది.
13వ వార్డు కౌన్సిలర్ ఎన్నిక రద్దు చేస్తూ..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 9 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు, స్వతంత్రులు నాలుగు వార్డుల్లో గెలుపొందారు. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 11 కావాలి. కానీ, స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాలేదు. 9 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్కు ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఓటుతో బీఆర్ఎస్ బలం పదికి చేరింది. చైర్మన్ పీఠాన్ని గెలుచుకునేందుకు మరో సభ్యుడి అవసరం మాత్రమే ఉంటుంది. దీనిని గమనించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం బీఆర్ఎస్కు దక్కకూడదని భావించి స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన నలుగురు కౌన్సిలర్లను తనవైపు తిప్పుకుంది.
కాంగ్రెస్‌పార్టీ కుట్రలను గమనించిన 13 వార్డు కౌన్సిలర్ గుండ స్నేహ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతును ప్రకటించి ఓటు వేశారు. దీంతో బీఆర్ఎస్కు 11 మంది మద్దతు పెరిగింది. చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. బీఆర్ఎస్కు చైర్మన్ పీఠం దక్కడంతో అక్కసు పెంచుకున్న కాంగ్రెస్ పార్టీ, చైర్మన్ స్థానాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 13వ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ జారీచేసిన విప్‌ను ధిక్కరించి బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన కారణంగా 13 వార్డు కౌన్సిలర్ ఎన్నిక రద్దు చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాల మీద స్పందించిన అధికారులు 13వ వార్డు కౌన్సిలర్ ఎన్నికను రద్దు చేస్తూ నోటీసు జారీ చేశారు.
కౌన్సిలర్‌కు అండగా బీఆర్ఎస్
13వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ స్నేహకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ఆమె గెలుపును రద్దు చేస్తూ జారీ చేసిన నో టీసులపై కోర్టులో న్యాయం జరిగేలా చూస్తామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. కౌన్సిలర్ గెలుపు ను రద్దు చేస్తున్న అధికారులు జారీ చేసిన నోటీసుపై తన వ్యక్తిగత లాయర్ ద్వారా ప్రత్యేకంగా స్టే తెచ్చేందుకు కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇవ్వడంతో పాటు కౌన్సిలర్‌కు అండగా నిలిచారు.
న్యాయ పోరాటం చేస్తాం..
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 13వ వార్డు నుంచి గెలుపొందాను. నా సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తా. కోర్టు ద్వారా న్యాయం జరిగేలా చూస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసానిచ్చారు. న్యాయమే గెలుస్తుందనే నమ్మకముంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా టిక్కెట్ ఇచ్చినప్పటికీ, నన్ను ఓడించేందుకు ఆ పార్టీ నాయకులు అనేక కుట్రలు చేశారు. కాంగ్రెస్ నుంచి రెబల్స్‌ను నిలబెట్టి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 13వ వార్డులోని ఓటర్లు నామై నమ్మకంతో గెలిపించారు. ఇందులో నా వ్యక్తిగత కృషి తప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. చైర్మన్ ఎన్నికల్లో నాకు నచ్చిన పార్టీ అభ్యర్థికి ఓటు వేశాను. నాకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.
– గుండ స్నేహ, 13వ వార్డు కౌన్సిలర్