మూసీ సుందరీకరణతో నగరవాసులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ మరో స్కెచ్ గీసింది. మూసీ వెంబడి కూల్చివేతలు, రెడ్ మార్కింగ్, నోటీసులతో సర్కార్‌పై ప్రజల నుంచి పెరుగుతున్న అసహనాన్ని దృష్టి మళ్లించేలా అసలు ప్రణాళికను దాచిపెడుతున్నది. ‘కిలోమీటర్ వెడల్పు’ కాదంటూనే.. మూసీ, ఈసా బఫర్ జోన్ నుంచి 50 మీటర్ల దూరంలోని భూములే సేకరిస్తామంటూ కొత్త రాగం అందుకొన్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మూసీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వెడల్పులో ఉన్న భూములను సేకరించి, అభివృద్ధి చేసే ఉద్దేశమే గనుక సర్కార్‌కు ఉంటే.. కిలోమీటరు దూరంలో ఉన్న సర్వే నంబర్లలోని భూములను ఎందుకు వెదికినట్టు? కిలోమీటరు మేర భూములు సేకరిస్తామని ప్రజాసంఘాలకు ఏడాది కిందటే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎవరిని మభ్యపెట్టడానికి వివరించినట్టు? ప్రపంచబ్యాంక్ నిధుల కోసం రూపొందించిన నివేదికలోనూ మూసీ వెంబడి జరుగనున్న వరల్డ్ క్లాస్ అభివృద్ధిని ఏ విధంగా ప్రస్తావించారు? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏకంగా నగర జనాలకు సియోల్ నదీ పర్యటనకు తీసుకెళ్లి, అక్కడి నదీ తీరంలో జరిగిన అభివృద్ధి నమూనాను ఎలా చూపించారు?
అనే ప్రశ్నలతో మూసీ భూములపై కాంగ్రెస్ వాస్తవాలకు పాతరేస్తూ దాగుడు మూతలు ఆడుతున్న తీరు బట్టయలైతున్నది. మూసీ పరీవాహక ప్రాంతంలో సింగపూర్ తరహా అభివృద్ధికి నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన స్కెచ్‌ను.. నేడు సీఎం రేవంత్‌రెడ్డి 30 ఏండ్ల తర్వాత ఇప్పుడు అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్టున్నారు. ముంబైకి చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అప్పట్లోనే 3,000 ఎకరాలను కట్టబెట్టేందుకు సిద్ధపడ్డారు. ఆ కుట్రలను పసిగట్టిన పర్యావరణవేత్తల ఆందోళనలతో వెనక్కి తగ్గారు.
మూసీ వెంబడి ‘కిలోమీటరు వెడల్పు’ అంశం రాష్ట్ర స్థాయి వివాదానికి తెరలేపింది. పరీవాహక జనాలతోపాటు, ప్రజాసంఘాలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు కుట్ర బయటపడిందని గ్రహించి నిజాలను కప్పిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ కట్ట నుంచి 500 మీటర్ల దూరంలో మాత్రమే భూములను సేకరిస్తామని రెవెన్యూ అధికారులతో సర్కార్ వివరణ ఇప్పించింది. మూసీ బఫర్ జోన్ నుంచి 50 మీటర్లు మాత్రమే సేకరిస్తామని స్పష్టంచేసింది. ఇందులోనే అసలు తిరకాసు దాగి ఉన్నదనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ స్థాయిలో మాటలు చెప్తున్నా సర్కార్.. ఏడాది నుంచి మూసీ పరీవాహక ప్రాంతాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, ఆకాశ హర్మ్యాలు, గ్లోబల్ సిటీకి అనువైన రిక్రియేషనల్ జోన్లు, అంతకు మించి విలాసవంతమైన భవనాలకు అనువైన ల్యాండ్ బ్యాంక్‌ను ఎలా సేకరించాలనే ఆలోచనలో మునిగి తేలుతున్నది. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఆచితూచి అడుగులు వేస్తున్నది. నిజానికి పేదల భూములు గుంజుకొనే ఉద్దేశమే సర్కార్‌కు లేనప్పడు… సియోల్ నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రణాళికలను నమూనాగా ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇలా అసలు విషయాలను దాచిపెట్టి, భూములు లాక్కోవడానికి నయవంచన మాటలతో మూసీ భూములను చెరబట్టనున్నది.
ఒక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలంటే కనీసం 200 నుంచి 300 మీటర్ల వెడల్పు స్థలం కావాలి. అంతర్జాతీయ స్థాయిలో ఒక హోటల్‌తో కూడిన వినోద కేంద్రాన్ని నిర్మించాలంటే సెట్ బ్యాక్కే 30 మీటర్లు కావాలి. మరి 50 మీటర్లలో ఎక్స్‌ప్రెస్ వేలు, హోటళ్లు, వినోద కేంద్రాలు నిర్మించగలమా? వాస్తవానికి ఇదే నిజమైతే సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో మూసీకి ఇరువైపులా కిలోమీటరు అభివృద్ధి కారిడార్‌ను చేస్తానని ఎందుకు ప్రకటించింది? ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో నదికి రెండువైపులా అంతర్జాతీయస్థాయి అభివృద్ధి కారిడార్లను ఏర్పాటు చేస్తామని ఎందుకు చెప్పింది? ప్రజాప్రతినిధులు, మీడియాను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సియోల్‌కు తీసుకెళ్లి అలాంటి అభివృద్ధినే మూసీకి ఇరువైపులా చూస్తారంటూ ఎందుకు చెప్పారు?
భూసేకరణపై ప్రజల్లో పెల్లుబికుతున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా 50 మీటర్ల రాగం అందుకొన్నది. అధికారులను ముందుపెట్టి మూసీ ప్రాజెక్టులో 50 మీటర్ల బఫర్ జోన్‌కే పరిమితం అవుతామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పిస్తున్నది. ప్రస్తుతానికి ‘కిలోమీటరు’ను దాచి.. 50 మీటర్లతో మొదలుపెట్టే భూసేకరణ దశలవారీగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు అర్థమవుతుంది.
మూసీ సుందరీకరణలో భాగంగా జీవో నంబర్ 168, జీవో నం.7 ప్రకారం 100 మీటర్ల లోపు ఎలాంటి భవన నిర్మాణ అనుమతులు ఉండవని ఎంఆర్డీసీఎల్ స్పష్టం చేసింది. నదికి ఇరువైపులా సుందరీకరణ చేసేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ నిబంధనలను అనుసరిస్తామని పేర్కొన్నది. ఈ క్రమంలో కిలోమీటరు వెడల్పును ఖండించిన మూసీ రివర్ డెవలప్మెంట్ సంస్థ ఓ ప్రకటన చేసింది. దీని ప్రకారం ఇప్పటివరకు నిర్వహించిన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం గుర్తించిన 2,166 నిర్మాణాలు మాత్రమే రివర్ బెడ్లో ఉన్నాయని, 7,851 నిర్మాణాలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయని, మొత్తంగా 10,017 నిర్మాణాలను మాత్రమే గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెల్లడించినట్టుగా పేర్కొన్నది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు తొలి దశలో సుందరీకరణ పనులు చేపడుతామని, బఫర్ జోన్ల హద్దురాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
మూసీ ఫుల్ రివర్ లెవల్ నుంచి 50 మీటర్ల లోపు ఉండే భూములకు ఎలాంటి హక్కులు ఉండవని తాజా ప్రకటనతో తెలిపిందనే అనుమానం కలుగుతున్నది. ఈ లోపు నిర్మాణాలన్నింటినీ అక్రమంగా తేల్చే క్రమంలోనే తొలుత 50 మీటర్ల వెడల్పు భూములని ప్రకటించినట్టుగా తెలుస్తున్నది. ఆ పరిధిలో పట్టా భూములు ఉన్నా.. వారసత్వంగా వచ్చిన భూములైనా, రిజిస్ట్రేషన్ చేసుకొని, హుడా, జీహెచ్ఎంసీ అనుమతులతో కట్టుకొన్న నిర్మాణాలన్నింటినీ నది ఆక్రమణలుగా లెక్కగడుతూ వాటన్నింటినీ నేలమట్టం చేసి మూసీలో కలిపేందుకు సర్కార్ సిద్ధమవుతున్నది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ మొదలుకొని గౌరెల్లి వరకు విస్తరించి ఉన్న 54 కిలోమీటర్ల మేర ఫుల్ రివర్ లెవల్ నుంచి 50 మీటర్ల దూరంలో ఉండే ఆస్తులను ఈ విధంగా ఆక్రమణలుగా తేల్చి భూములు గుంజుకొంటారని తెలుస్తున్నది.