– బీబీనగర్‌లో పీహెచ్సీ నూతన భవనం ప్రారంభం
బీబీనగర్, నవంబర్ 22 : రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలు ప్రభుత్వ వైద్య వనరులపై నమ్మకం పెంపొందించుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం బీబీనగర్ మండల కేంద్రంలో 15వ ఆర్దిక సంఘం నిధులు రూ.1.56 కోట్లతో నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పిహెచ్సీ భవనం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, రేపటి నుండి వైద్య సేవలు కొత్త భవణంలో కొనసాగుతాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కాకుండా ప్రభుత్వ దవాఖానలను ఉపయోగించుకోవాలని, గ్రామాల ప్రజలు ప్రభుత్వ వైద్య వనరులపై నమ్మకం పెంపొందించుకోవాలన్నారు. అర్హులైన వైద్యులు పిహెచ్సిలో అందుభాటులో ఉంటారని తెలిపారు. ప్రైవేట్ దవాఖానలో చేసే వైద్యమే ఇక్కడ కూడా చేస్తారని, ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లో వైద్య సేవలు పొందాలన్నారు. రోగులకు అందించే చికిత్సలో అంతరాయం లేకుండా వైద్యులు సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. దవాఖానలో ఫర్నీచర్ ఏర్పాటుకు కూడా నిధులు మంజూరైనట్లు తెలిపారు.
అదేవిధంగా మండలంలోని మగ్దంపల్లి, గొల్లగూడెం, రావి పహాడ్, రావి పహాడ్ తండా, మాదారం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా గ్రామాల్లో అత్యధిక నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ర్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. మొదటి విడతలో ఇల్లు రానివారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
బొల్లెపల్లి కాల్వ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీ నుండి నియోజకవర్గంలో మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్దల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, జడ్పీ సీఈఓ శోభారాణి, డీఎంహెచ్ఓ మనోహర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి, తాసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, నాయకులు గోలి పింగళ్‌రెడ్డి, పొటోళ్ల శ్యామ్‌గౌడ్, గోలి నరేందర్‌రెడ్డి, పంజాల రామాంజనేయులు గౌడ్, సురకంటి సత్తిరెడ్డి, గడ్డం బాల్ రెడ్డి, గడ్డం బాలకృష్ణ గౌడ్, బద్దం వాసుదేవ రెడ్డి, దూడల మధు గౌడ్ పాల్గొన్నారు.

Bibinagar : రోగులకు మెరుగైన వైద్య సేవలు : ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం