Dhandoraa Gaddar Awards | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ చిత్రం తన సత్తా చాటుకుంది. మూడు ముఖ్యమైన కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం నాడు ఘనంగా ‘థాంక్యూ మీట్’ నిర్వహించింది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ నిర్మాణంలో, దర్శకుడు మురళీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రభుత్వ గుర్తింపును పొందడం విశేషం.
ఈ వేడుకలో హీరో శివాజీ మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. “మా కష్టాన్ని గుర్తించి అవార్డులు అందించిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ‘శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది’ అన్నట్లుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమాపై చేసిన ట్వీట్ వల్ల ‘దండోరా’ తెలుగు ప్రజలందరికీ చేరువైంది. ఈ సినిమాలో నటించడం కోసం నేను రోజుకు కేవలం రెండు, మూడు గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని. నటనను దైవంతో సమానంగా భావిస్తాను. ఈ చిత్రం ఇక్కడితో ఆగిపోయేది కాదు, తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చాటుతూ మున్ముందు మరిన్ని జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకుంటుందనే నమ్మకం నాకు ఉంది అని ఆయన పేర్కొన్నారు.
దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ.. సినిమా విజయంలో టీమ్ వర్క్ ప్రాముఖ్యతను వివరించారు. “కొత్త దర్శకుడినైనా నమ్మి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన టీమ్‌కు ధన్యవాదాలు. ముఖ్యంగా శివాజీ గారు ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా, కనీసం క్యారవాన్ కూడా అడగకుండా షూటింగ్లో సహకరించారు. సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యక్తిగతంగా ఫోన్ చేసి అభినందించడం మా బాధ్యతను మరింత పెంచింది. ఇలాంటి గుర్తింపు మరిన్ని సందేశాత్మక చిత్రాలు తీయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది,” అని తెలిపారు.
ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్న మార్క్ కె రాబిన్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుండి గద్దర్ అన్న పాటలు వింటూ పెరిగాను. ఈ రోజు ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడం గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మురళీకి రుణపడి ఉంటాను,” అన్నారు.
నిర్మాత రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ సినిమా ప్రయాణంలో తోడుగా నిలిచిన సాహు, నాగవంశీ మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నటుడు నందు మాట్లాడుతూ.. సినిమా విజయం అనేది సమిష్టి కృషి అని, భవిష్యత్తులో ‘ఉత్తమ నిర్మాత’ కేటగిరీని కూడా ప్రవేశపెట్టాలని కోరారు.
కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ మాట్లాడుతూ.. కథ విన్నప్పుడే మనసుని తాకిందని, మార్క్ సంగీతం విన్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఎమోషనల్ అయ్యారు.
నటి మనికా రెడ్డి మాట్లాడుతూ ‘దండోరా’ వంటి గొప్ప చిత్రంలో భాగం కావడం తన అదృష్టమని పేర్కొన్నారు.
నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి వంటి ప్రతిభావంతులైన నటీనటుల కలయికలో వచ్చిన ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని చిత్ర పరిశ్రమ ఆకాంక్షిస్తోంది.