
Gumpula | ఓదెల, నవంబర్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామంలోని మానేరు వాగులోని చెక్ డ్యాం శనివారం తెల్లవారుజాము వరకు కూలి ఉంది. ఇక్కడ 2022 సంవత్సరంలో రూ.19 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రైతుల సాగునీటి కష్టాలను తీర్చడానికి మానేరు వాగులో చెక్ డ్యాం లో నిర్మాణాలను చేపట్టి భూగర్భ జలాల వృద్ధికి దోహదపడ్డారు. ఈ చెక్ డ్యాం ద్వారా వాగులో నీరు నిలిచి సాగునీటికి ఉపయోగపడడమే కాక బావులల్లో నీటి నిల్వలు పెరిగి యాసంగిలో వ్యవసాయానికి నీటి ఇబ్బందులు, లేకుండా చేశారు. చెక్ డ్యాం నిర్మాణాల వల్ల నీరు ఉండటంతో ఇసుక తీసుకపోవడానికి ఇబ్బందిగా మారడంతో ఇసుక మాఫియా వారే చెక్ డ్యామ్ ను పేల్చివేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం వరకు బాగానే ఉన్న చెక్ డ్యాం తెల్లవారేసరికి కూలి ఉందని పేర్కొంటున్నారు. గతంలో తుఫాన్లు వచ్చినా, ఎల్ఎండీ నీరు కిందికి విడుదల చేసిన సందర్భాలలో చెక్ డ్యాంకు నష్టం జరగలేదని, ఇప్పుడు ఎలా కూలిందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నట్లు రైతులు వాపోతున్నారు. కాగా మరి కొందరేమో నిర్మాణంలో నాణ్యత లోపం కూడా ఉందని పేర్కొంటున్నారు. చెక్ డ్యామ్ కూలడం వల్ల మానేరులోని నీరంతా కిందకు వెళ్లి ఎడారిని తలపిస్తోంది. దీంతో యాసంగిలో వ్యవసాయం సాగు కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత మూడు సంవత్సరాలుగా వేసవిలో చెక్ డ్యాం వల్ల నీటికి ఇబ్బందులు లేకుండా సాఫీగా పనులు జరిగినట్టు రైతులు తెలిపారు. ప్రస్తుతం చెక్ డ్యామ్ కూలడం రైతులకు తీరని వ్యథగా చెప్పుకుంటున్నారు. కాగా ఈ చెక్ డ్యాం కు సమీపంలో అతి పురాతన రామభద్ర ఆలయం ఉంది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి పుణ్య స్థానాలను ఆచరిస్తుండేవారు. ఇప్పుడు నీరు లేక భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. చెక్ డ్యాం కూలిన ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెక్ డ్యాం కూలడానికి పేల్చివేతనా లేక నాణ్యత లోపమా తేల్చాలని కోరుతున్నారు.