T20 World Cup 2026 | ప్రస్తుతం భారత్‌లో టీ20 వరల్డ్ కప్ 2026 జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఆడిన సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లు క్వింటన్ డి కాక్, డేవిడ్ మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ నుంచి వీలైనంత త్వరగా తాము వెళ్లాలి అనుకుంటున్నట్లు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అసలు ఏం జరిగిందంటే?
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన సౌతాఫ్రికా, సూపర్ 8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ జట్లు ప్రస్తుతం కోల్‌కతాలో చిక్కుకుపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులపై ఆంక్షలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు వారం రోజులుగా భారత్‌లోనే వేచి చూస్తున్నప్పటికీ, వారి కంటే ఆలస్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ జట్టు కోసం ఐసీసీ ప్రత్యేకంగా చార్టర్డ్ ఫైట్‌ను ఏర్పాటు చేసింది. దీనిపై డికాక్ మరియు మిల్లర్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.
క్వింటన్ డి కాక్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇది చాలా విడ్డూరంగా ఉంది. ఐసీసీ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. కానీ మాకంటే ఆలస్యంగా ఓడిపోయిన ఇంగ్లాండ్ అప్పుడే బయలుదేరి ఇంటికి వెళ్తోంది. వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లను చీకట్లో ఉంచారు. కొన్ని జట్లకే ఐసీసీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు.
మరో స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇంగ్లాండ్ నిష్క్రమించిన వెంటనే వారి కోసం చార్టర్డ్ ఫైట్ రెడీ అయిపోయింది. మేము సమాధానాల కోసం కోల్‌కతాలో ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ కూడా స్పందిస్తూ.. మిల్లర్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. తమను స్వదేశానికి చేర్చడంలో ఐసీసీ వివక్ష చూపుతోందని వారు ఆరోపించారు. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ కూడా ఐసీసీ పక్షపాత వైఖరిని తప్పుబట్టారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, సౌతాఫ్రికా మరియు వెస్టిండీస్ జట్లు ఆదివారం భారత్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది.
PLAYERS WANT TO LEAVE INDIA ASAP. 🤯
– Quinton de Kock and David Miller are absolutely furious with the ICC. pic.twitter.com/Wc9LmlChla
— Sheri. (@CallMeSheri1_) March 7, 2026