Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల విషయంలో అసత్యపు వ్యాఖ్యలు చేశారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి పలు దేశాలపై సుంకాల భారం మోపుతూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంప్.. భారత్ తమను సుంకాలతో చంపేస్తోందని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా చైనా (China), బ్రెజిల్ (Brezil) కూడా తమను సుంకాలతో చంపుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ తీరు ‘దొంగే.. దొంగా దొంగా..’ అని అరిచినట్టుగా ఉంది.
తాజాగా స్కాట్ జెన్నింగ్స్ రేడియో షో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్.. తమ వస్తువులపై ఆయా దేశాలు అత్యధిక టారిఫ్లు విధిస్తున్నాయని విమర్శించారు. భారత్ సుంకాలతో తమని చంపేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా వస్తువులపై సుంకాలు ఉండవని ఢిల్లీ అంగీకరించిందని చెప్పారు. భారత దిగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించడాన్ని ఆయన మరోసారి సమర్థించుకున్నారు.
ట్రంప్ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘మాపై పలు దేశాలు సుంకాలు విధించాయి. చైనా సుంకాలతో చంపేస్తోంది. సుంకాలతో భారత్ కూడా మమ్మల్ని చంపుతోంది. బ్రెజిల్ కూడా భారీ సుంకాలు విధిస్తోంది. అందరికంటే ఎక్కువగా సుంకాల గురించి అర్థం చేసుకున్నా. నేను చేపట్టిన చర్యలతోనే ఆయా దేశాలు దిగివస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్. తమ వస్తువులపై సుంకాలు ఉండవని వాళ్లు నాకు చెప్పారు. నేను ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే వాళ్లు దిగివచ్చేవారు కాదు. అందుకే సుంకాలు ఉండాలి. ఆర్థికంగా మరింత బలపడతాం’ అన్నారు.
అదేవిధంగా అనేక దేశాలపై అమెరికా విధిస్తున్న టారిఫ్లు అక్రమమని ఓ ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపై కూడా ట్రంప్ స్పందించారు. ఆ కేసును ఇతర దేశాలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆరోపించారు.