Viral news : ప్రేమించుకోవడానికి దేశాలు, సంస్కృతులు, భాషలు లాంటి హద్దులు ఉండవని మరోసారి రుజువైంది. అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన యువకుడు, కేరళ (Kerala) రాష్ట్రానికి చెందిన యువతి ఫ్రాన్స్ (France) లో ప్రేమించుకున్నారు. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. యువతి కోరిక మేరకు భారత్‌లో వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు.
వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రం ఎర్నాకుళంకు జిల్లాకు చెందిన అంజలి, అమెరికా వాసి అయిన రాబర్ట్ వెల్స్ మూడేళ్ల క్రితం ఫ్రాన్స్‌లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. ఇద్దరూ ఉన్నత విద్యాభ్యాసం కోసం అక్కడికి వెళ్లారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇరుకుటుంబాల పెద్దలకు చెప్పి వారి అంగీకారం పొందారు.
ఈ క్రమంలో ఓనం పండగ సందర్భంగా ఇద్దరూ అంజలి స్వస్థలమైన కొచ్చికి వచ్చారు. స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. వధూవరులిద్దరూ కేరళ సంప్రదాయ వస్త్రధారణలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివాహం అనంతరం రాబర్ట్ స్వయంగా అందరికీ మిఠాయిలు పంచి తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. తన భర్త రాబర్ట్‌కు భారతీయ సంస్కృతి అంటే ఇష్టమని చెప్పారు. ముఖ్యంగా కేరళ వంటకాలంటే చాలా మక్కువ చూపిస్తారని తెలిపారు. తమ అల్లుడు అమెరికా వ్యక్తి కావడం చాలా సంతోషంగా ఉందని అంజలి తల్లిదండ్రులు చెప్పారు. ‘మాకు అమెరికా అల్లుడు రావడం చాలా గర్వంగా, సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.