సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): వాహన ఆధారిత యాప్ డ్రైవర్లు తమ టార్గెట్ పూర్తి చేసుకోవడానికి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒక్క రోజులో చాలా రైడ్స్ చేయాలనే ఆతృతతో నగర రోడ్లపై బండ్లను పరుగులు పెట్టిస్తున్నారు. నిమిషాల్లో రైడ్ పూర్తి చేసి..మరో రైడ్ తీసుకోవాలని మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. నెమ్మదిగా వెళ్లాలని ప్రయాణికుడు సూచిస్తే తనకు చెప్పాల్సిన అవసరం లేదని వాగ్వాదానికి దిగుతున్నాడు. కొందరు డ్రైవర్లు బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారు. చాలా మంది యాప్ డ్రైవర్లు మొబైల్ బైక్, ఆటోలకు అమర్చి వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నారు. అలా డ్రైవింగ్ చేయొద్దని వారిస్తే కొందరు డ్రైవర్లు ప్రయాణికుడిపై దాడికి సైతం దిగుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. యాప్ డ్రైవర్ల ఆగడాలను నియంత్రించాల్సిన వ్యవస్థ రాష్ట్రంలో లేకపోవడంతో ఇష్టానుసారంగా సదరు సంస్థలు వ్యవహరించడం గమనార్హం.
నిబంధనలకు పాతర..
నగరవాసులు అత్యధికంగా తమ ప్రయాణ గమ్యాలు చేరుకోవడానికి యాప్ ఆధారిత వాహన సేవలపై ఆధారపడతున్నారు. ర్యాపిడో, ఓలా, ఉబర్ తదితర యాప్‌ల్లో వాహనదారులు తమ వివరాలను అందించి డ్రైవర్లుగా మారుతున్నారు. అయితే చాలా మంది తమ వివరాలతో కాకుండా ఇతరుల లైసెన్స్ వివరాలతో యాప్‌లో లాగిన్ అయి అనుమతి పొందుతున్నారు. దీంతో వాహనం బుక్ చేసుకుంటే మరో నంబర్ గల వాహనం వస్తుంది. కొన్ని సందర్భాల్లో వాహన నంబర్లు ఒకేలా ఉన్నప్పటికీ డ్రైవర్లు మారుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. కొందరు డ్రైవర్లు తమ బైక్ వాహనాల సీటును ఎత్తుగా ఉండేలా అమర్చుతున్నారు. దీంతో సదరు మహిళలు ఆ వాహనాలను ఎక్కినప్పుడు ఇబ్బందులకు గురవుతున్నారు.