Kamal Haasan : ప్రస్తుతం వీధి కుక్కల (Stray Dogs) స్వైరవిహారం, రేబిస్ (Rabies) వ్యాధి, సుప్రీంకోర్టు ఆదేశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో కుక్క కాటు ఘటనలు పెరిగిపోవడం, వీధి కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం, అది సబబు కాదని జంతు ప్రేమికులు ఆందోళన చేయడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటించిన ఓ చిత్రంలోని డైలాగ్ వైరల్ అవుతోంది. కమల్ హాసన్ నటించిన ‘ఆళవందాన్’ చిత్రం 2001లో విడుదలైంది. ఆ సినిమాలో శునకాల గురించి ఉన్న ఓ డైలాగ్ ప్రస్తుతం తమిళనాడులో వైరల్‌గా మారింది. ‘నేను పెంచిన కుక్కను నేను ఎలా చంపగలను. ఒకవేళ అది పిచ్చిది అయితే మాత్రం దాన్ని చంపాలి’ అని ఆ డైలాగ్ ఉంటుంది.
ఆ డైలాగ్‌ను తమిళనాడులో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. వీధి కుక్కల సమస్య గురించి ఆయన ఎన్నో ఏళ్ల క్రితమే అవగాహన కల్పించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ఆళవందాన్’ సినిమాలోని డైలాగ్ వైరల్ అవుతున్న విషయాన్ని బుధవారం చెన్నై విమానాశ్రయం బయటకు వచ్చిన కమల్‌హాసన్ ముందు మీడియా ప్రస్తావించింది.
దాంతో ఆయన మాట్లాడుతూ.. ‘మనం సాధ్యమైనంతలో ప్రతి జంతువుకు రక్షణ కల్పించాలి. ఎన్నో దశాబ్దాలపాటు బరువులు మోసిన గాడిదలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఇప్పుడు వాటి గురించి ఎవరైనా చింతిస్తున్నారా..? వాటిని రక్షించడం గురించి ఎవరైనా మాట్లాడారా..? కేవలం కుక్కల విషయంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు..?’ అని ప్రశ్నించారు.
కాగా వీధి కుక్కల దాడులవల్ల ఢిల్లీ, NCR పరిధిలో రేబిస్ మరణాల సంఖ్య పెరుగుతోందని వస్తున్న వార్తలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఎనిమిది వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇటీవల ఆదేశించింది. దీనిపై జంతుప్రేమికులు అభ్యంతరం తెలుపడంతో.. రేబిస్ లక్షణాలు లేదా విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇతర శునకాలను వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలిపెట్టాలని సూచించింది.