Dog Bite | పెంపుడు జంతువుల్లో కుక్కలు కూడా ఒకటి. వీటిని పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు ఇవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అనుకోకుండా కొందరు కుక్క కాటుకు గురవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వీధికుక్కల కాటు బారిన కూడా చాలా మంది పడుతున్నారు. అయితే కుక్క కాటును అస్సలు విస్మరించకూడదు. కుక్కకాటు రేబిస్ తో సహా తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెంపుడు కుక్క కరిచినా, వీధి కుక్క కరిచినా వెంటనే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కుక్క కాటు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. కనుక కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్క కాటు తరువాత ముందుగా భయపడకూడదు. కుక్క కరిచిన చోట గాయాన్ని సబ్బుతో 10 నుండి 15 నిమిషాల పాటు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తరువాత వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. గాయం తీవ్రతను బట్టి వైద్యులు ఇంజెక్షన్ లు ఇస్తారు. రేబిస్ తో పాటు టెటనస్ వచ్చే ప్రమాదం ఉన్నందున టెటనస్ షాట్ కూడా తీసుకోవాలి. కనీసం 4 నుండి 5 మోతాదులు తీసుకోవాలి. ఇది రేబిస్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. వైద్యుడు సూచించిన మందులను వాడడం మంచిది. కుక్క కాటును నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రథమచికిత్స తీసుకుని వైద్యుడిని సంప్రదించి తగిన మందులు, ఇంజెక్షన్ లు వాడడం మంచిది. కుక్కకాటు కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది కనుక దీనిని అస్సలు తేలికగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
అలాగే కుక్క కాటు తరువాత కొన్ని ఆహారాలను తీసుకోవడం మానేయాలి. కుక్క కాటు తరువాత స్వీట్స్ ను తినకూడదు. స్వీట్స్ వాపులకు కారణమవుతాయి. వైద్యం నెమ్మదిస్తుంది. కుక్క కాటు నోటి దగ్గర లేదా ముఖం మీద ఉన్నట్టయితే నమలడం కష్టంగా ఉంటుంది. కనుక గట్టిగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను కూడా తీసుకోకూడదు. ఇవి శ్లేష్మం ఉత్పత్తిని, బ్యాక్టీరియాను కూడా పెంచుతాయి. ఇన్పెక్షన్ మరింత తీవ్రతరం అవుతుంది. కుక్కకాటు తరువాత మద్యం కూడా తాగకూడదు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్పెక్షన్ పెరుగుతుంది. కారంగా, పుల్లగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇవి గాయాన్ని చికాకు పెట్టడంతో పాటు నొప్పిని కలిగిస్తాయి.