నర్సాపూర్ : రోడ్డు ప్రమాదాలు( Road Accident ) విధి రాత కాదని, నిర్లక్ష్య ఫలితమేనని జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాస్ రావు ( SP DV Srinivasa Rao ) వెల్లడించారు. గురువారం నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ ఐటీ కళాశాలలో పోలీస్ ఆధ్వర్యంలో అరైవ్- అలైవ్ ( Arrive-Alive ) అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్ధి రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్ కావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఎవరి ప్రాణాలు కోల్పోకుండా సురక్షితంగా గమ్యం చేరడమే లక్ష్యంగా నూతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భారతదేశంలో ప్రతిరోజు సగటున సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, గత సంవత్సరం దేశవ్యాప్తంగా 1.6 లక్షల మంది మృతి చెందారని, సుమారు 3 లక్షల మంది గాయపడ్డారని తెలిపారు.
మెదక్ జిల్లాలో గత సంవత్సరం 287 మంది మృతి చెందగా 631 మంది గాయపడ్డారని గుర్తుచేశారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమేనని ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉందని ఆవేధన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60 శాతం ద్విచక్ర వాహనాలకే సంబంధించినవని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, హెల్మెంట్ లేకపోవడం, మధ్యం సేవించడం వంటి కారణాలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.
విద్యార్థులకు రోడ్డు భద్రతపై క్వీజ్ పోటీలు నిర్వహించి విజేతలకు హెల్మెట్లను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్ , తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.