శనివారం 05 డిసెంబర్ 2020
International - Nov 06, 2020 , 10:46:53

అమెరికా అధ్యక్షుడిని తేల్చేది ఈ రాష్ట్రాలే!

అమెరికా అధ్యక్షుడిని తేల్చేది ఈ రాష్ట్రాలే!

హైద‌రాబాద్‌:  రెండు రోజుల నుంచి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉన్న‌ది.  అధ్య‌క్షుడు ట్రంప్‌, ప్ర‌త్య‌ర్థి బైడెన్‌ల మ‌ధ్య పోరు ఆస‌క్తిక‌రంగా మారింది.  ప్ర‌స్తుతానికి మ్యాజిక్ ఫిగ‌ర్‌కు బైడెన్ ద‌గ్గ‌ర్లోనే ఉన్నా.. ట్రంప్ కూడా పీఠాన్ని కైవ‌సం చేసుకునే అవ‌కాశాలూ ఉన్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య నువ్వానేనా అన్న‌ట్లుగా ఫైట్ న‌డుస్తోంది. కొన్ని కీల‌క రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  ఎన్నిక‌ల కౌంటింగ్‌లో కుట్ర జ‌రిగిన‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ ఆరోపించారు.  పోస్ట‌ల్ బ్యాలెట్ల లెక్కింపు వ‌ల్ల జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్ వెనుకంజ‌లో ఉన్నారు.  

డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జో బైడెన్‌.. శాంతంగా ఉండాలంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు.  తానే ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌బోతున్న‌ట్లు ఆయ‌న విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు.  ప్ర‌స్తుతం పెన్సిల్వేనియా, నెవ‌డా, ఆరిజోనా, జార్జియా, నార్త్ క‌రోలినా రాష్ట్రాల్లో కౌంటింగ్ కొన‌సాగుతున్న‌ది. ఈ రాష్ట్రాల్లో ఇంకా విజేత తేలాల్సి ఉన్న‌ది. బైడెన్ 253, ట్రంప్ 213 ఎల‌క్టోర‌ల్ ఓట్ల‌ను ఇప్ప‌టికే గెలుచుకున్నారు. అయితే బైడెన్ అధ్య‌క్ష రేసు గెల‌వాలంటే.. పెన్సిల్వేనియా లేదా మ‌రో రెండు రాష్ట్రాల్లో ఆయ‌న విజ‌యం సాధించాల్సి ఉంటుంది. ఇక ట్రంప్ రెండోసారి అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేపట్టాలంటే.. పెన్సిల్వేనియాతో పాటు నాలుగింటిలో మ‌రో మూడు రాష్ట్రాలు క‌చ్చితంగా గెల‌వాల్సి ఉంటుంది.  ఒక‌వేళ ఆరిజోనా, నెవెడా, నార్త్ క‌రోలినా, పెన్సిల్వేనియాలో ట్రంప్ విజ‌యం సాధిస్తే, అప్పుడు ఎల‌క్ష‌న్ ఫ‌లితాలు టై అవుతాయి. 

బైడెన్ ఇప్ప‌టికే 253 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలిచారు. అంటే ఆయ‌న అధ్య‌క్షుడు కావాలంటే మ‌రో 17 ఓట్లు అవ‌స‌రం.  అప్పుడే ఆయ‌న‌కు వైట్‌హౌజ్ చిక్కుతుంది. ఒక‌వేళ ఆయ‌న ఒకే ఒక్క పెన్సిల్వేనియా(20) గెలిచినా.. 46వ అధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం ఖాయం.  అయితే ఈ సంద‌ర్భంలో ట్రంప్ కోర్టును ఆశ్ర‌యించ‌నున్న విష‌యం తెలిసిందే.  ఒక‌వేళ నెవ‌డా(6), ఆరిజోనా(11)ల‌ను గెలిస్తే, అప్పుడు కూడా బైడెన్ దేశాధ్య‌క్షుడిగా ఎన్నిక‌వుతారు.  ఆ స‌మ‌యంలో ఆయ‌న జార్జియా గెల‌వాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.  

ఇక ట్రంప్ కూడా గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి.  కానీ ఆ అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. ట్రంప్ మాత్రం క‌చ్చితంగా పెన్సిల్వేనియా నెగ్గాల్సిందే.  పోస్ట‌ల్ ఓట్ల లెక్కింపు నేప‌థ్యంలో ఆ రాష్ట్రంలో ఆయ‌న ఆధిక్యం త‌గ్గుతోంది. ఆరిజోనా, నెవ‌డా, జార్జియా, నార్త్ క‌రోలినాల్లో మూడు రాష్ట్రాల‌ను గెలిస్తే, అప్పుడు ట్రంప్ అధ్య‌క్షుడ‌వుతారు. ఇక అల‌స్కాలో కూడా కౌంటింగ్ కొన‌సాగుతోంది. కానీ అక్క‌డ ట్రంప్ విక్ట‌రీ దాదాపు ఖాయ‌మైంది.