శుక్రవారం 05 జూన్ 2020
International - May 13, 2020 , 16:06:56

లాక్‌డౌన్ సడలింపుపై వెనుకకు తగ్గని దక్షిణకొరియా

లాక్‌డౌన్ సడలింపుపై వెనుకకు తగ్గని దక్షిణకొరియా

సీయోల్: దక్షిణ కొరియా ప్రభుత్వం కఠినమైన లాక్‌డౌన్ తిరిగి ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రాజధాని సియోల్‌లో నైట్‌క్లబ్స్ ద్వారా తాజాగా 119 మందికి కరోనా సోకినప్పటికీ సడలింపు నిర్ణయంలో మార్పులేదని తెలిపింది. సడలింపుల అనంతరం ఇటావోన్ బస్తీలోని నైట్‌క్లబ్బులు, బార్ల కారణంగా కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. రెండో విడత మహమ్మారి విస్తరణకు అది దారితీయగలదని భయాందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా దక్షిణకొరియా ప్రభుత్వం సడలింపులు అమలులోకి తెచ్చింది. అందులో భాగంగా తెరచిన నైట్‌క్లబ్బుల ద్వారా కనీసం 119 మందికి కరోనా వ్యాపించింది. వారిలో 11 మంది 19 సంవత్సరాల లోపు వయసువారే. కొత్త ఇన్ఫెక్షన్ల వేటలో అధికారులు సతమతం అవుతున్నారు. కొత్త కేసుల సంఖ్య 50 లోపు ఉన్నంతవరకు కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని ఆరోగ్యశాఖ ఉపమంత్రి కిమ్ గాంగ్-లిప్ చెప్పారు. ప్రస్తుత వ్యాప్తి తీరుతెన్నులు పరిశీలించిన తర్వాతే ఆలోచిస్తామని కిమ్ మీడియాకు చెప్పారు. కొన్ని నైట్‌క్లబ్బులను, బార్లను అధికారులు మూసేయించినప్పటికీ మిగతా రంగాల్లో లాక్‌డౌన్ ఎత్తివేత విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వారంరోజులు వాయిదా వేసినప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సౌకర్యాలు, క్రీడాకేంద్రాలు మొదలైనవాటికి ఇచ్చిన స్థూలమైన సడలింపులను మాత్రం వెనుకకు తీసుకోలేదు. సబ్‌వే రైళ్లల్లో ప్రయాణించేవారు రద్దీవేళల్లో ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. విజయవంతంగా కరోనాను అదుపు చేసిన దేశాల్లో ఒకటిగా దక్షిణకొరియా గుర్తింపు పొందింది. అయితే కరోనా నియంత్రణలోకి వచ్చిందని ధీమాతో ఉంటే కొంప మునుగుతుందని, నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


logo