Israel attacks : గాజా (Gaza)పై ఇజ్రాయెల్ (Israel) దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 36 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. రఫాలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో ఈ దాడులు జరిగాయి.
ఘటన సమయంలో వేలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం తీసుకోవడం కోసం అక్కడ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ దాడుల్లో 36 మంది మృతిచెందగా.. 115 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటపై హమాస్ స్పందించింది. మానవతా సాయం అందించే పేరుతో ఇజ్రాయెల్ దళాలు సామూహిక హత్యలకు పాల్పడ్డాయని ఆరోపించింది.
అయితే దీనిపై టెల్అవీవ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. 2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ల మధ్య జరుగుతున్న పోరులో గాజాలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. ఇటీవల మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్ అనుమతిచ్చింది.
అయితే ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అమెరికా 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి ఇజ్రాయెల్ ఇప్పటికే అంగీకరించగా, హమాస్ కూడా ఒప్పుకుంది.