Sharmistha Panoli : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి వ్యతిరేకంగా ‘ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)’ చేపట్టిన సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టిందనే కారణంతో 22 ఏళ్ల లా స్టూడెంట్ (Law Student) శర్మిష్ఠ పనోలీ (Sharmishta Panoli) ని కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై తాజాగా డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ (Geert Wilders) స్పందించారు.
సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఆధారంగా పోలీసులు శర్మిష్ఠను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని వైల్డర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. శర్మిష్ఠను శిక్షించవద్దని కోరారు. ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠను విడుదల చేయాలని, ఆ మేరకు అధికారులను ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అందరి దృష్టి శర్మిష్ఠపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆపరేషన్ సింధూర్పై స్పందించని బాలీవుడ్ నటులను ఉద్దేశించి శర్మిష్ఠ సోషల్ మీడియా వేదికగా ఇటీవల ఒక వీడియో పోస్టు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కోరింది. ఈ క్రమంలోనే ఆమెపై పలు ఫిర్యాదులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. అమెను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.