Tejpratap Yadav : వారం రోజుల క్రితం ఆర్జేడీ (RJD) నుంచి, కుటుంబం నుంచి బహిష్కరణకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ (Tejpratap Yadav) తన తల్లిదండ్రులకు లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా (X account) లో పోస్టు చేశారు. ‘మీరన్నా, మీరిచ్చే ఆదేశాలన్నా నాకు దేవుడి కంటే ఎక్కువ’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
‘ప్రియమైన అమ్మా నాన్నా.. నా ప్రపంచమంతా మీరిద్దరే. మీరన్నా.. మీరిచ్చే ఎలాంటి ఆదేశాలన్నా నాకు భగవంతుడి కంటే ఎక్కువ. మీరు నా పక్కన ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. నాకు మీ నమ్మకం, మీ ప్రేమ ఉంటే చాలు. ఇంకేమీ అవసరం లేదు.’ అని తేజ్ ప్రతాప్ రాసుకొచ్చారు. ‘పప్పా.. మీరు లేకుంటే పార్టీ లేదు. నాతో రాజకీయాలు చేస్తున్న జైచంద్ లాంటి నాయకులు లేరు. అమ్మానాన్నా.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి.’ అంటూ తన పోస్టును ముగించారు.
తాను గత 12 ఏళ్లుగా ఒక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నానని ఇటీవల తేజ్‌ప్రతాప్ యాదవ్ తన ఫేస్బుక్లో పోస్టుపెట్టడంతో ఆ పోస్టు వైరల్ అయ్యింది. దాంతో ఆ పోస్టు పెట్టింది తాను కాదని, తన ఫేస్బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తేజ్ ప్రతాప్ వివరణ ఇచ్చారు. అయినా ఆ మరుసటి రోజు లాలూ ప్రసాద్ యాదవ్.. తేజ్‌ప్రతాప్‌ను పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.