వరంగల్, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం పుట్టింది. ఆ ముసలానికి ముగ్గుపోసింది మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. కొమ్మాల శ్రీలక్ష్మీ నర్సింహస్వామి జాతర సాక్షిగా కొండా మురళి, ఆయన కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు ఇటు వరంగల్ తూర్పు, అటు పరకాల నియోజకవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ‘ప్రభ’బండ్ల సాక్షిగా మరోసారి తారాజువ్వలా ఎగజిమ్మింది.
‘సైలంట్‌గా ఉండండి.. ఎవరి పని వాళ్లు చేసుకోండి. ఒకరి పరిధుల్లోకి మరొకరు దూరకండి’ అని పార్టీ అధిష్టానం గతంలో హితబోధ చేయడంతో కొంతకాలం అలా ఉన్నట్టు బయటకు కనిపించినా తమ మధ్య ఉన్న శత్రు వైఖరిలో మార్పు ఉండబోదని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కొమ్మాలలో మురళి ఆయన కూతురు సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసినవి కావని, వారు స్పష్టమైన వైఖరితోనే భవిష్యత్ కార్యాచరణకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారని తేలిపోయిందని వారి వర్గీయులు చెబుతున్నారు.
ఇక మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం వారికి తాత్కాలిక విడిది కేంద్రంగానే మారబోతున్నదా? అంటే అవునని, అందుకు మురళి వ్యాఖ్యలే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీలో ఒకవర్గం చెబుతున్నది. ‘పరకాల మనది.. రేపు ఎవరొచ్చినా కొండా సురేఖ నిలబడడం ఖాయం’ అని మురళి కొమ్మాలలో స్పష్టం చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. అదే సమయంలో తన కూతురు సుస్మిత పటేల్‌ను ఆయన ఆకాశానికి ఎత్తుతూ తన కన్నా ధైర్యవంతురాలని, ‘చిట్టక్క తిట్టాలంటే వీడూ వాడని చూడదు.. మొన్ననే (ఇటీవల దక్కన్ సిమెంట్ ఉదంతంలో హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులపై ఆమె చేసిన వ్యాఖ్యలు) మీరు చూసిండ్లు’ అని గుర్తుచేశారు. అయితే, ‘సీఎంనే లెక్కచేయలేదు.. ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఓ లెక్కా’ అన్నట్టు మురళి వ్యవహరించడం సరైంది కాదనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
రెండు చోట్లా మూడేసి గ్రూపులు
అధికార కాంగ్రెస్ పార్టీలో పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో మూడేసి గ్రూపులు ముచ్చటగా రాజకీయం చేయనున్నాయా? అంటే పరిణామాలు అవుననే అంటున్నాయి. ఇప్పటిదాకా పరకాలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్గాలే ఉండేవి. కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి కూడా రేవూరి వర్గంలోనే ఉండేవారు. కానీ, జాతర ప్రారంభానికి ఒకరోజు ముందు గీసుగొండలో ఇనుగాల వర్గీయులు ఎమ్మెల్యే రేవూరి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు కట్టడం, వాటిని ఎమ్మెల్యే వర్గం చించివేయడం జరిగింది. అలాగే గత జాతరలో ఎమ్మెల్యేతో కలిసి వచ్చిన ఇనుగాల ఈసారి రాకపోగా, గీసుగొండ, సంగెం మండలాల్లో ఆయన ప్రభ బండ్లను ప్రారంభించి వెళ్లారు.
ఈ పరిణామాలతో నియోజకవర్గంలో రేవూరి, ఇనుగాల రెండు వర్గాలుగా విడిపోయారని, దీంతో మొత్తం ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో మూడు వర్గాలుగా ఉన్నాయని తేలిపోయింది. ఇక మంత్రి కొండా సురేఖ పరకాల నుంచి పోటీ చేస్తుందని మురళి ప్రకటించడంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలాటను మరింత రసవత్తరం చేయనున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణమే నెలకొన్నది. మంత్రి కొండా సురేఖ పరకాలకు వెళ్తే తానే పోటీచేసే అవకాశాలుంటాయని వారి అనుంగు అనుచరుడు లోపాయికారిగా తన ఏర్పాట్లలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా సమీప భవిష్యత్‌లో పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీలో రసవత్తర రాజకీయాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని పార్టీలో జోరుగా చర్చ సాగుతున్నది.