Ramayana | భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఎట్టకేలకు అభిమానుల ముందుకు తన మొదటి ట్రైలర్‌ను తీసుకొచ్చింది. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ విజువల్ ఎపిక్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ జూలై 30 తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ చిత్రం విజువల్ పరంగా కొత్త ప్రమాణాలను సృష్టించేలా కనిపిస్తోంది. సుమారు రూ.2,000 నుంచి రూ.3,000 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు పనిచేస్తుండటంతో, హాలీవుడ్ స్థాయి విజువల్ అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో మేకర్స్ ముందుకెళ్తున్నారు.
సుమారు 4 నిమిషాల 10 సెకన్ల నిడివితో విడుదలైన ట్రైలర్ ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచుతుంది. రావణుడు, ఇంద్రుడి మధ్య జరిగే భీకర యుద్ధ సన్నివేశాలతో మొదలైన ట్రైలర్లో, జనక మహారాజు యజ్ఞం, శ్రీరాముడి జననం, ఆయన పరాక్రమం, విశ్వామిత్రునితో ప్రయాణం, వనవాసం వంటి కీలక ఘట్టాలను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ భారీదనం కనిపిస్తుండగా, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో గ్రాఫిక్స్ రూపొందించినట్లు ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తుండగా, సాయి పల్లవి సీతగా నటించారు. అయితే ట్రైలర్లో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన పాత్ర మాత్రం యష్ పోషించిన రావణుడిదే. శక్తివంతమైన లుక్, ప్రభావవంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆయన పాత్ర ట్రైలర్‌కు ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది.ఇక సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో నటిస్తున్నప్పటికీ, ట్రైలర్లో ఆయన పాత్రను పూర్తిగా రివీల్ చేయకుండా మేకర్స్ సస్పెన్స్ కొనసాగించారు. దీంతో పూర్తి సినిమాలో హనుమంతుడి పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్‌కు నేపథ్య సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్తో పాటు ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్ చేసింది. భారీ యుద్ధ ఘట్టాలు, భావోద్వేగ సన్నివేశాలు, విజువల్ ప్రెజెంటేషన్‌కు తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తొలి భాగాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.