హుస్నాబాద్, మార్చి 4 : నిత్యం కరువు, కాటకాలు, అతివృష్టి, అనావృష్టితో సతమతమయ్యే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మించ తలపెట్టిన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మారింది. అధికారంలోకి రాకముందు హుస్నాబాద్ ప్రాంత రైతులపై, గౌరవెల్లి భూనిర్వాసితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించి తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని డంబాలు పలికిన కాంగ్రెస్ నేతలకు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వాయర్ పేరు తీసేందుకు కూడా ఇష్టపడక పోవడం గమనార్హం. బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే రిజర్వాయర్ పూర్తి కాలేదని, భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, తామైతే తక్షణమే పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ హోదాలో పొన్నం ప్రభాకర్ హామీల మీద హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా వారు రిజర్వాయర్ వైపు చూడకపోవడం విడ్డూరంగా ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి రిజర్వాయర్‌పై ప్రత్యేక కథనం..
ప్రకటనలకే పరిమితమైన నిధులు
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే గౌరవెల్లి రిజర్వాయర్ కాలువల నిర్మాణానికి రూ.437కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇందులోంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం గమనార్హం. ‘రూపాయి తెచ్చింది లేదు…కాలువలు తవ్విం ది లేదు’.. అంటూ రైతులు చర్చించుకుంటున్నారు. మొదట భూసేరకణ చేసి అనంతరం కాలువల నిర్మా ణం చేయాల్సి ఉంది. నిధులు మంజూరై రెండేండ్లు గడుస్తున్నా కాలువలకు కావాల్సిన ఒక్క ఎకరాన్ని కూడా సేకరించి పరిహారం చెల్లించిన దాఖలాలు లేవు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కాలువల కోసం రూ.200 కోట్ల నిధులు మంజూరయ్యాయని, పరిపాలనా అనుమతులు కూడా వచ్చాయని మంత్రి పొన్నం ప్రకటించడం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మీడియాకు చెప్పించ డం, ఎన్నికల్లో లబ్ధిపొందడం తప్పా రిజర్వాయర్ పనుల్లో మాత్రం పురోగతి లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేసులు రద్దు చేయించడంలో విఫలం
గౌరవెల్లి రిజర్వాయర్‌పై భూనిర్వాసితులు వేసిన ఎన్జీటీ, వనశక్తి కేసులతో పాటు వివిధ కేసులను రద్దు చేయించడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఈ కేసులు సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. 2021లో ఆరుగురు భూ నిర్వాసితుల ఆధ్వర్యంలో ఓఏ 180-2021 కేసు ఫైల్‌చేశారు. పిటిషన్ దారులతో మాట్లాడి గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ సంస్థలకు సరైన సమాధానాలు ఇచ్చి కేసులు పరిష్కరిస్తే తప్పా రిజర్వాయర్ పనులు ముందుకు సాగవనేది నిపుణుల వాదన. ఆ దిశగా ప్రయత్నించాల్సిన ప్రభుత్వం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ ఎన్నికల్లో గెలువడమే లక్ష్యంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడికక్కడే భూనిర్వాసితుల సమస్యలు
రెండున్నరేండ్లు గడుస్తున్నా కనీసం భూనిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించలేని కాంగ్రెస్ సర్కార్‌పై నిర్వాసితులు కన్నెర్ర చేస్తున్నారు. 2007 నుంచి ఇప్పటి వరకు 19ఏండ్లు గా నిర్వాసితులకు తమకు రావాల్సిన పరిహారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. చట్టబద్ధంగా వారికి రావాల్సిన లబ్ధిని చేకూర్చలేక కుంటి సాగులు చెప్పడంపై మండి పడుతున్నారు. అధికారంలోకి రాకముందు నిర్వాసితులను పలుమార్లు పరామర్శించి మొసలి కన్నీరు కార్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పడేం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 937 కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాల్సి ఉంది. 139 మంది వివాహం అయిన మహిళలకు ఒక్కొక్కరికి రూ.6లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇంకా 42ఎకరాలకు పరిహారం అందించాలి. భూనిర్వాసితులకు కూడా చెల్లింపులు చేయలేని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్‌ను ఎలా పూర్తి చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గౌరవెల్లిపై తాత్సారం..దాటవేత ధోరణి ?
గౌరవెల్లి రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుందా.. ఎప్పుడు మా పొలాలు పంటలతో కళకళలాడుతాయా.. అని రెండు దశాబ్దాలుగా హుస్నాబాద్ ప్రాంత రైతులు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులకు మోకాలడ్డిన కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసిన ఈ ప్రాంత ప్రజలు, రైతులు అసహనానికి గురవుతున్నారు. క్యాబినెట్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఇంకెన్నాళ్లు తాత్సారం చేస్తారని, దాటవేత ధోరణిని ప్రదర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. రిజర్వాయర్ మిగులు పనులతో పాటు కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగు నీళ్లు ఇవ్వకుంటే వచ్చే కొద్ది నెలల్లో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి రైతు లు సన్నద్ధమవుతున్నారు.

బీఆర్ఎస్ హయాంలో 96శాతం పనులు పూర్తి
2007లో గౌరవెల్లి రిజర్వాయర్‌ను కేవలం 1.23టీఎంసీల సామర్థ్యంతోనే శంకుస్థాపన చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8.23టీఎంసీలకు పెంచింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రిజర్వాయర్‌ను సందర్శించి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం రూ.1095. 99కోట్ల నిధులతో 10.56కి.మీ.ల రిజర్వాయర్ కట్ట నిర్మాణం, రూ.770 కోట్లతో 12కి.మీ.ల మేర టన్నెల్, సర్జిపూల్ పంపుహౌస్ నిర్మాణం, 32మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు భారీ మోటర్లను సైతం బిగించారు. 3,836ఎకరాల భూసేకరణ చేసి 937 నిర్వాసితుల కుటుంబాలకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సైతం అమలు చేశారు. 2023 అక్టోబర్ నాటికి రిజర్వాయర్ పనులు 96శాతం పూర్తయ్యాయి. మూడు మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్‌లో గోదావరి నీళ్లను సైతం నిం రు. కాంగ్రెస్ నేతలు కుట్ర పూరితంగా వేయించిన ఎన్జీటీ కేసు వల్ల పనులు ముందుకు సాగలేదు.
తట్టెడు మట్టి కూడా తీయలేదు..
గౌరవెల్లి రిజర్వాయర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు పూటకో మాటచెబుతూ, ప్రతి ఎన్నికకు ముందు ప్రకటనలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూనిర్వాసితులను రెచ్చగొట్టి కేసులు వేయించి పనులు ముందుకు సాగకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు రిజర్వాయర్ పనులు ముట్టుకోక పోగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా నిధులు కేటాయించి రిజర్వాయర్ పూర్తి చేయాలి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి, లేకుంటే రైతులు, నిర్వాసితుల ఆగ్రహానికి గురికాక తప్పదు.
-వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, హుస్నాబాద్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాం..
గౌరవెల్లి రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుందోనని రెండేండ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు అయితలేవు. ఇంకెన్ని రోజులకు పూర్తి చేస్తరో చెప్తలేరు. ఈ మధ్య వానదేవుడు కరుణిస్తుండు కాబట్టి బతికిపోతున్నాం, లేకుంటే ఇక్కడ పంటలు పండక కడుపు ఎండబెట్టుకొని బతికే పరిస్థితి ఉండేది. బీఆర్ఎస్ సర్కా రు చేయలేదని, మేంవస్తే చేస్తమని చెప్పిన నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు.? గత సర్కారు దాదాపు పూర్తి చేసింది. మిగు లు పనులు పూర్తి చేయరా ? వెంటనే గౌరవెల్లిని పూర్తి చేయాలి.
-కాశబోయిన శ్రీనివాస్, రైతు, గొల్లకుంట, అక్కన్నపేట మండలం, (సిద్దిపేట జిల్లా)
తిప్పలు పడుతున్నాం..
వానకాలం పంటలు బాగా పండినప్పటికీ యాసంగి పంటలకు నీళ్లందక తిప్పలు పడుతున్నాం. కాలువలు వస్తయ్…నీళ్లు వస్తాయని అనుకుంటే అవి రావడం లేదు. బోరు, బావులు అడుగంటి పోతున్నాయి. యాసంగి పంటలు చేతికొస్తయో లేదోననే భయం ఉన్నది. ఎల్ఎండీ లెక్క మాకు కూడా రిజర్వాయర్ ఉంటే నీళ్ల గోస ఉండేదికాదు. ఒక్క కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వటానికే కాంగ్రెస్ సర్కారుకు కష్టమవుతుందా…రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులనే మర్చిపోతరా…? రైతు సర్కారు అని చెప్పుకునేటోళ్లు రైతులకు కావాల్సిన నీళ్లు ఇవ్వడం లేదు.
-బొల్లి శ్రీనివాస్, రైతు, కట్కూరు ,అక్కన్నపేట మండలం, (సిద్దిపేట జిల్లా)