మరిపెడ, మార్చి 4 : లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని తెలిసినా కొన్ని ప్రైవేట్ దవాఖానలు బేఖాతర్ చేస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడిన కొందరు ఆర్ఎంపీలు నకిలీ వైద్యులతో కలిసి అబార్షన్లను ప్రోత్సహిస్తున్నారు. నెలల పిండాన్ని కడుపులోనే చిదిమేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ దందా మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాంతంలో కొన్ని ఆస్పత్రుల్లో జోరుగా సాగుతున్నది. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో మరిపెడ ప్రాంతంలో గిరిజనులు అత్యధికంగా ఉన్నారు.
ఇక్కడికి చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా నిత్యం గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇప్పుడే పిల్లలు వద్దు అని భావించిన కొందరు అబార్షన్ల కోసం ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఆర్ఎంపీల వద్ద క్యూ కడుతుండగా, దీనిని ఆసరా చేసుకున్న వారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేయిస్తున్నారు. మరికొందరు కుటుంబ సభ్యుల ఒత్తిడితో అబార్షన్లు చేయించుకుంటున్నారని తెలిసింది.
వైద్యాధికారుల పర్యవేక్షణ కరువు..
మరిపెడ కేంద్రంగా అబార్షన్లు విచ్చలవిడిగా జరుగుతున్నా జిల్లా వైద్యాధికారులు నిమ్మకు నీరైతినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ దవాఖానలు చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నా జిల్లా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో కొంత మంది ఆర్ఎంపీలు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. నిబంధనలు పాటించని వీటిపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గర్భిణి నెలలను బట్టి వసూలు..
అక్రమ సంపాదన కోసం కొన్ని ప్రైవేట్ దవాఖానాలు ఇష్టానుసారంగా ప్రసవాలు చేస్తున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షల కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గర్భిణులకు స్కానింగ్ చేయడమే కాకుండా ఆడపిల్ల ఉన్నట్లు గుర్తిస్తే అబార్షన్‌కు ప్రోత్సహిస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కై ప్రసవం, ఇతర ఆపరేషన్ కేసులను రెఫర్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నారని తెలుస్తున్నది. నకిలీ వైద్యుల వ్యవహారంతో కొన్ని సందర్భాల్లో పురిటిలోనే బిడ్డ ప్రాణాలు పోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.