Paper Leak : బీహార్‌ను కుదిపేసిన బీపీఎస్సీ (Bihar Public Service Commission) టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష-3 (TRE-3) పేపర్ లీక్ కేసు (Paper Leak Case) లో ఆర్థిక నేరాల విభాగం (EOU) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మనీశ్ కుమార్ (Doctor Manish Kumar) ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ డాక్టర్ పరీక్షకు ముందే 30 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందించి.. వారి నుంచి సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈవోయూ అధికారుల కథనం ప్రకారం.. డాక్టర్ మనీశ్ కుమార్ ఎలాంటి ఆనవాళ్లు లేకుండా సీల్డ్ ప్రశ్నాపత్రాల బాక్సులను తెరిచి, తిరిగి మూసివేయడంలో నైపుణ్యం సంపాదించాడు. ప్రతి అభ్యర్థి నుంచి రూ.50,000 కమీషన్‌గా తీసుకున్నాడు. తన సహచరులైన డాక్టర్ శివ్, డాక్టర్ శుభంతో కలిసి ఈ రాకెట్‌ను నడిపినట్లు గుర్తించారు. 2024 మార్చి 15న జరిగిన పరీక్షకు ముందు పట్నాలోని ఓ హోటల్లో 30 మంది అభ్యర్థులకు బస ఏర్పాటు చేసి, వారికి ముందుగానే ప్రశ్నాపత్రాన్ని అందించాడు.
మార్చి 14న భాబువాలోని కోహినూర్ హోటల్‌పై అధికారులు దాడి చేసినప్పటికీ.. మనీశ్ కుమార్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో పోలీసులు అతడిని గుర్తించారు. పట్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (PMCH), నలంద మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (NMCH) విద్యార్థుల డేటాను పరిశీలించి అతడి గుర్తింపును ధ్రువీకరించుకున్నారు. ఈ డాక్టర్ మనీశ్ పేపర్ లీక్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సంజీవ్ ముఖియా కుమారుడని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మందిని అరెస్ట్ చేశారు.