భద్రాచలం, మార్చి 4: ఏటా శ్రీరామనవమికి ముందు నిర్వహించే తొలి వేడుక భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం వైభవోపేతంగా ఆరంభమైంది. ప్రతీ జంటకు ఆదర్శంగా నిలిచే కల్యాణ రాముడి వివాహ మహోత్సవ పనుల్లో భాగంగా మహిళలు సంప్రదాయబద్ధంగా పసుపు కొమ్ములు దంచే పనులకు శ్రీకారం చుట్టారు. ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములను దంచి.. తలంబ్రాల తయారీతో పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ.
మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ పల్లకీ సేవగా స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. అకడ స్వామివారికి, చోళ్లు, రోకళ్లకు అర్చకులు పూజలు చేశారు. తర్వాత దేవస్థానం ఈవో దామోదర్‌రావు దంపతులు, అర్చకుల, పండితుల సతీమణులు పసుపు కొట్టడంతో కల్యాణ పనులు ప్రారంభమయ్యాయి. పాదయాత్ర ద్వారా భక్తులు రామనామస్మరణ చేస్తూ తీసుకొచ్చిన తొలి గోటి తలంబ్రాలను ఆలయ అధికారులు తలపై ధరించి స్వామివారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు.
వసంతోత్సవంతో శోభ
శ్రీసీతారామచంద్రస్వామికి వసంతోత్సవం, డోలోత్సవ కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. అర్చకులు తొలుత బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతోపాటు సువర్ణలక్ష్మి అమ్మవారికి పంచామృతంతో కలశాభిషేకం, సహస్ర ధారతో స్నపనం చేపట్టారు. ప్రత్యేకంగా అలంకరించిన ఊయలపై సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను ఆశీనులు చేశారు. ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను అలపిస్తుండగా.. అర్చకులు పూజలు చేశారు. ఆనంతరం స్వామివారికి నక్షత్ర హారతి సమర్పించడంతో పసుపు కొమ్ములు దంచి పెళ్లి పనులను ప్రారంభించారు. ఆపై బియ్యంలో పసుపు, రోజ్ వాటర్, గులాల్, సుగంధ ద్రవ్యాలను కలిపి తలంబ్రాలతోపాటు వసంతాలను సీతారాములపై చల్లిన అర్చకులు వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆపై భక్తులపైనా రంగులు చల్లడంతో బేడా మండపం అంతా రంగులమయమైంది.