సిటీబ్యూరో: మరోసారి భూముల వేలానికి కసరత్తు మొదలైంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు నిధుల సర్దుబాటుపై దృష్టిపెట్టిన సర్కార్… భూముల వేలానికి ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. వచ్చే నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 3500 కోట్ల విలువ చేసే ప్లాట్లను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంలో రూ. 6438 కోట్లు వచ్చాయి. గతేడాది జూన్ నాటి నుంచి డిసెంబర్ వరకు జరిగిన వేలంలో 72 ఎకరాలను విక్రయించడంతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చేరాయి.
రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో భూముల వేలం ద్వారానే ఖజానా నింపుకొంటున్న సర్కారు.. ఇందులో అత్యధికంగా కోకాపేట నియోపోలిస్ నుంచి ఎకరం రూ. 150 కోట్లకు పలికింది. కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్, బహదూర్‌పల్లి, తొర్రూర్, తుర్కంయాంజల్ వంటి ప్రాంతాల్లో ఉన్న హెచ్ఎండీఏకు ఉన్న లే అవుట్లలో ప్లాట్లను విక్రయించింది. పలు దశల వారీగా నిర్వహించిన వేలంలో హెచ్ఎండీఏకు మంచి ఆదాయం మాత్రం కేవలం కోకాపేట నియోపోలిస్ నుంచి మాత్రమే వచ్చింది. ఇందులోనే 45 ఎకరాల ప్లాట్ల ద్వారా రూ. 3800 కోట్లు వచ్చి చేరాయి.