Chain snachers : ఉప్పల్ (Uppal) లో మహిళా చైన్ స్నాచర్ (Chain snachers) లు కలకలం రేపారు. ఇద్దరు మహిళా చైన్ స్నాచర్లు ఓ దుకాణంలో చొరబడి, ఆ దుకాణం నిర్వహిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఉప్పల్ ఏరియాలోని విజయపురి కాలనీ (Vijayapuri Colony) లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. విజయపురి కాలనీలో సంధ్య అనే మహిళ గాజుల దుకాణం నిర్వహిస్తోంది. ముఖాలకు ముసుగులు కట్టుకున్న ఇద్దరు మహిళా చైన్ స్నాచర్లు శనివారం మధ్యాహ్నం ఆ దుకాణానికి వచ్చారు. కస్టమర్లలా మాట్లాడుతూ.. మహిళ ముఖంపై మత్తుమందు చల్లారు. ఆమె స్పృహ కోల్పోగానే మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఇతర ఆభరణాలను లాక్కుని పారిపోయారు.
ఆ తర్వాత తేరుకున్న మహిల కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చారు. పారిపోయిన స్నాచర్ల కోసం కాలనీలో వెతికారు. దొంగలు దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.