Farmers | రాయపోల్, మార్చి 11 : కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి రామాయంపేట కెనాల్ ద్వారా వస్తున్న గోదావరి జలాలను తమ గ్రామాలకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన బాట పట్టారు. బుధవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వీరనగర్ స్టేజి వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి రెండు గంటలపాటు ధర్నా రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చెరువులు నింపుకోవడానికి కాల్వ ఉన్నప్పటికీ నీళ్లు విడుదల చేయడం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా లింగారెడ్డి పల్లి గ్రామ రైతులు మాట్లాడుతూ.. చెరువు కింద వేసిన పంటలు ఎండిపోయే దశకు వచ్చాయని రామాయంపేట్ కెనాల్ ద్వారా చెరువు నింపి పంటలను కాపాడాలని గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. లింగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్, పెద్ద ఆరేపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్ఛి తమ పంట పొలాలకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. తలాపున కెనాల్ ఉన్నప్పటికీ తమ చెరువులోకి నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని ఆయా గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఆందోళన విరమించి ప్రసక్తే లేదని..
వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వరి నాట్లు వేసినప్పటికీ చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో ఆయకట్టు కింద ఉన్న వరి పంట పొలాలు ఎండిపోయే దశకు వస్తున్నాయని.. దీంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని వెంటనే రామాయంపేట కెనాల్ ద్వారా మూడు గ్రామాల చెరువులకు నీళ్లు విడుదల చేయాలని లేనిపక్షంలో తాము రోడ్డుపై ఆందోళన విరమించి ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రైతుల ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న రాయపోలు ఎస్ఐ మానస అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా ఆందోళన చేశారు.
ఎస్ఐ మానస రైతులతో మాట్లాడుతూ.. సంబంధిత ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మూడు గ్రామాల రైతులు, లింగారెడ్డి పల్లి సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ స్వామి, ఆయా గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.


Read Also :
Air India Plane | హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం.. థాయ్‌లాండ్‌లో హార్డ్ ల్యాండింగ్
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : కొండపల్లి శ్రీరామ్
Bhuteshwar Dham Temple: మాంసం తిన్న పూజారి.. ఫోటో వైరల్ కావడంతో విధుల నుంచి తొలగింపు