Air India Plane : ఎయిరిండియాకు చెందిన ఎక్స్‌ప్రెస్ జెట్ విమానం థాయ్‌లాండ్‌లో హార్డ్ ల్యాండింగ్ అయింది. దీంతో ఎయిర్పోర్ట్ పరిధిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ ఘటనతో ఎయిర్పోర్ట్ రన్‌వేను అక్కడి అధికారులు మూసేశారు. ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 737-800 అనే విమానం బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ ఐలాండ్ బయల్దేరింది.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.40 గంటలకు విమానం ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవ్వాలి. అయితే, అంతకంటే ముందుగా 11.24 గంటలకు విమానం ఎయిర్‌పోర్ట్‌లో హార్డ్ ల్యాండ్ అయింది. దీంతో కొద్దిసేపు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర పరిస్తితి ఏర్పడింది. అయితే, విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. ప్రయాణికులు అంతా క్షేమంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో విమానం గేర్ భాగం కొద్దిగా దెబ్బతింది. ఫలితంగా విమానం కదలడానికి అవకాశం లేకుండా ఆగిపోయింది. దీంతో అక్కడి నిపుణులు కొద్దిసేపు తనిఖీలు నిర్వహించారు.
ఇంకా విమానం భద్రతకు సంబంధించిన తనిఖీలు, మరమ్మతు పనులు వంటివి కొనసాగుతున్నాయి. ఇందుకోసం ఎయిర్పోర్ట్ అధికారులు నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్) జారీ చేశారు. రన్‌వేను అధికారులు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు రన్‌వేను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొన్ని విమానాల్ని అధికారులు దారి మళ్లించారు. క్రాబి, సూరత్ తాని వంటి వేరే ప్రదేశాల్లో ల్యాండ్ చేయిస్తున్నారు. విమానాల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.