కంది, ఆగస్టు 3: భవిష్యత్ తరాలకు అవసరమయ్యే నిపుణులను సిద్ధం చేయాలన్నదే ఐఐటీహెచ్ సంకల్పమని, అణుశక్తి రంగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సును ప్రారంభిస్తున్నామని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ, ఐఐటీహెచ్, క్రిమ్సన్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సీఈఈపీఎల్) సంయుక్తంగా అణు గ్యాన్- న్యూక్లియర్ టెక్నాలజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ.. అణుశక్తి రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని విస్తరిస్తూ, ప్రస్తుతం ఉన్న 8.8 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని 2047 వరకు 100 గిగావాట్లకు పెంచాలన్నదే ప్రధాన లక్ష్యమన్నారు. ఇంజినీర్లను సిద్ధం చేసేందుకు సీనియర్ నిపుణులతో కోర్సు ప్రారంభించామన్నారు. అణుశక్తి రంగానికి అవసరమైన అత్యున్నత సాంకేతిక నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తీర్చిదిద్ద మే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మూడు నెలల రెసిడెన్సియల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమల్లో రియాక్టర్ ఫిజిక్స్, థర్మల్ హైడ్రాలిక్స్, రేడియేషన్ షీల్డింగ్, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, అణు భద్రత, క్వాలిటీ అష్యూరెన్స్, ఇంజినీరింగ్ డిజైన్, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు తదితర అంశాలపై బోధించనున్నట్లు తెలిపారు. సీఈఈపీఎల్, న్యూక్లియర్ విభాగం అధ్యక్షుడు కమోడోర్ ఆర్డి మానే మాట్లాడుతూ అణు సాంకేతిక రంగంలో నాణ్య తా ప్రమాణాలతో కూడిన ఇంజినీరింగ్ నైపుణ్యత అవసరమన్నారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తెలియాడే అణు విద్యుత్ కేంద్రాల వంటి భవిష్యత్ సాంకేతికతలకు ఇంజినీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యమన్నారు. బీఎఆర్సీ, ఎన్పీసీఐఎల్ వంటి అణు విభాగంలోని ప్రముఖ సంస్థల్లో పని చేసిన నిపుణుల సమక్షంలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.