కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్ పరిధిలో డెక్కెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతతకు దారితీసింది. సోమవారం ఉదయం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా రెవెన్యూ అధికారులు..భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో పలు నిర్మాణాల తొలగింపు ప్రక్రియను మొదలుపెట్టారు. కాగా, అధికారులు కూల్చివేతలు ప్రారంభించగానే స్థానికులు వాగ్వావాదానికి దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. -కుత్బుల్లాపూర్, ఆగస్టు 3
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్ పరిధిలో అత్యంత విలువైన దిల్ (డెక్కెన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్, ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్) సంస్థకు చెందిన భూముల్లో వెలిసిన నిర్మాణాలపై కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వే నంబర్ 49/6, 49/9 పరిధిలో ఉన్న దాదాపు రూ.800 కోట్లకు పైగా విలువ చేసే సుమారు 16.20 ఎకరాల విస్తీర్ణంలోని సుమారు ఐదెకరాల పైచిలుకు భూముల్లో వెలిసిన నిర్మాణాలతో పాటు చిన్నచిన్న రేకుల షెడ్లు (సుమారు 40) పైగా నేలమట్టం చేశారు.
– కుత్బుల్లాపూర్, ఆగస్టు 3

కోట్లాది రూపాయాల విలువైన ప్రభుత్వ సంస్థకు చెందిన భూమి దుర్విని యోగం అవుతుందని అందిన సమగ్ర సమాచారంతో కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ యం త్రాంగం రంగంలోకి దిగింది. సోమవారం ఉదయం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలతో ఆక్రమణల తొలగింపు ప్రక్రియను చేపట్టారు. కోర్టు ఆదేశాలు, భూ రికార్డులను ఆధారంగా చేసుకొని సగానికి పైగా నిర్మాణాలను కూల్చివేశారు.
అధికారులతో బాధితుల వాగ్వాదం..
అధికారులు కూల్చివేతలు ప్రారంభించగానే ఆక్రమ ణదారులు, స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకొని అధికారులతో తీవ్ర వాగ్వావాదానికి దిగారు. పనులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో సూరారం సాయిబాబానగర్ పరిసరాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే స్థానిక సూరారం పోలీస్స్టేషన్ సీఐ బాలరాజు, ఎస్ఐ, సిబ్బంది ఆందోళనకారులను అడ్డు కున్నారు. ఈ క్రమంలో లాఠీలకు పని చెప్పడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. నిరుపేదలు నివాసముంటున్న ఇళ్లకు ఎలాంటి హాని తలపె ట్టలేదని, కేవలం వాణిజ్య అవసరాల కోసం, అక్రమ సంపాదన కోసం నిర్మించిన పారిశ్రామిక షెడ్లు, సూరారం ప్రధాన రహదారికి ఇరువైపులా వెలిసిన అక్రమ వాణిజ్య షాపులను, చిన్నచిన్న తాత్కలిక రూ ములను నేలమట్టం చేశామని అధికారులు తెలిపారు.
త్వరలోనే మరిన్ని కూల్చివేతలు..
సర్వేనంబర్ 49/6, నుంచి 49/9 పరిధిలోని ఉన్న 16.20 ఎకరాల స్థలాన్ని ఐటీ, పారిశ్రామిక అభివృద్ధి కోసం 2007లో అప్పటి ప్రభుత్వం ఎకరం రూ.6 కోట్ల చొప్పున దిల్ సంస్థకు కేటాయించింది. అయితే కాలక్రమేణా అక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో భూమి ఖాళీగా మిగిలిపోయింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు ఆక్రమణదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ స్థలాన్ని 60 చదరపు గజాల చొప్పున ప్లాట్లుగా విభజించి అక్రమంగా విక్రయించుకున్నారు. కాగా మరికొంతమంది అదే స్థలాలను యథేఛ్చగా ఆక్రమించి పారిశ్రామిక షెడ్లు, గౌడౌన్లు, కమర్షియల్ షాపులు నిర్మించి అద్దెలకు తిప్పుకోవడం ప్రారంభించారు. కాగా తదుపరి కూల్చివేతలు చేపడతామని చెప్పడంతో.. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Hyd4