Koratala Siva | నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రబృందం షూటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు గాయం కారణంగా కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్య.. త్వరలోనే షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ వచ్చే నెల నుంచి ఈ సినిమాకు డేట్స్ కేటాయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయనతో మొదటి షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు దర్శకుడు కొరటాల శివ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
బాలయ్యను ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో చూసిన అభిమానులకు.. కొరటాల శివ ఆయనను ఏ విధంగా చూపించబోతున్నారనే ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా కొరటాల మార్క్ కథనం, బాలయ్య మాస్ ఇమేజ్ కలిస్తే సినిమా ఏ రేంజ్లో ఉంటుందనే చర్చ ఇప్పటికే మొదలైంది. కొరటాల శివ సినిమాలను గమనిస్తే.. కథతో పాటు కథ జరిగే నేపథ్యానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తారనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల పరిస్థితులు, అక్కడి ప్రజల జీవన విధానం, సామాజిక సమస్యలు, వ్యవస్థతో ముడిపడిన అంశాలను కథలో భాగంగా చూపించడం ఆయన స్టైల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో బాలయ్యతో చేయబోతున్న సినిమాకు కొరటాల ఎలాంటి నేపథ్యాన్ని ఎంచుకున్నారనేది ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా కూడా ఓ ప్రత్యేకమైన ప్రాంతం, అక్కడి ప్రజల జీవనశైలి చుట్టూ తిరిగే కథగా ఉంటుందా? లేక పూర్తిగా కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు ఉన్న మాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుంటూనే.. కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కథలోని భావోద్వేగాలకు బలమైన స్థానం ఉండటంతో పాటు.. పాత్రల మధ్య సంబంధాలు, కుటుంబ బంధాలు సినిమాకు కీలకంగా ఉండబోతున్నాయని సమాచారం. అయితే బాలయ్యను కొరటాల ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే విషయంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలు బయటకు రాలేదు.