ముంబై: క్రికెటర్ శివమ్ దూబే(Shivam Dube) సీక్రెట్‌గా రైలు ప్రయాణం చేశాడు. అహ్మాదాబాద్‌లో టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన తర్వాత.. టీమిండియా క్రికెటర్ శివమ్ దూబే తన భార్య, పిల్లలతో కలిసి రైలులో ముంబైకి ప్రయాణించాడు. సోమవారం ముంబైకి వెళ్లాల్సిన అన్ని విమానాలు పూర్తిగా బుక్ కావడంతో.. రైలులో ప్రయాణం చేయాలని దూబేతో పాటు అతని భార్య అంజుమ్ నిర్ణయించారు. దీని కోసం ఓ స్నేహితుడి సహాయం కూడా వాళ్లు తీసుకున్నారు.
ఫ్లయిట్లు అన్నీ బుక్ కావడం వల్ల.. తెల్లవారుజామునే అహ్మదాబాద్ నుంచి ముంబైకి రైలులో వెళ్లాలని క్రికెటర్ డిసైడయ్యాడు. తలకు టోపీ, ముఖానికి మాస్క్, ఫుల్ స్లీవ్ టీషర్ట్ వేసుకుని.. రైలు ఎక్కాడు దూబే. రైలు కదిలేముందు వచ్చి అతను తన కోచ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత అప్పర్ బర్త్లోకి ఎక్కి దుప్పటి కప్పి పడుకున్నాడు. సుమారు 8 గంటల పాటు రైలు జర్నీ చేసేందుకు దూబే ప్రిపేరయ్యాడు. కానీ టికెట్ చెకింగ్ కోసం టీటీఈ వచ్చినప్పుడు .. అక్కడ కొంత సేపు ఆందోళనకర వాతావరణం నెలకొన్నది.
ప్రయాణికుల్లో క్రికెటర్ శివం దూబే ఉన్నారా అని ఆ టికెట్ చెకర్ గట్టిగా అరిచాడు. అయితే అక్కడే ఉన్న అతని భార్య అంజుమ్ జోక్యం చేసుకుని, లేదు లేదు.. అతను ఇక్కడెలా ఉంటాడని అనేసింది. ఆ మాటలు విన్న టీసీ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇక ట్రైన్ దిగే సమయంలో ముంబై పోలీసులు సహాయాన్ని కోరాడు దూబే.
వాస్తవానికి శివమ్ దూబే ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతాడేమో అని పోలీసులు అనుకున్నారు, కానీ ట్రైన్ ద్వారా వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ట్రైన్ దిగిన తర్వాత అక్కడ పోలీసులు ఎస్కార్ట్ కల్పించడంతో ఈజీగా దూబే ఇంటికి చేరుకున్నాడు. రైలులో దూబే ప్రయాణిస్తున్న విషయాన్ని బహిరంగంగా చెప్పకుండానే .. అభిమానుల తాకిడి నుంచి తప్పించుకుని జర్నీ చేశారు.