Delhi University | ఢిల్లీ: నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలపై సీజేపీ (Cocroach Janata Party) ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. జంతర్ మంతర్ వద్ద ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనల్లో పాల్గొనవద్దని ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) తన విద్యార్థులకు సూచించింది. అదేవిధంగా నకిలీ వార్తలు, ఏదైనా సమాచారం షేర్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీలోని అన్ని శాఖలకు తెలిపింది. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియంత్రిస్తారని వెల్లడించింది. ఇలాంటి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొంటే న్యాయపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఈ చట్టపరమైన చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలుగుతుందని, వృత్తిపరమైన అవకాశాలపై ప్రభావం పడుతుందని వెల్లడించింది. అదేవిధంగా వ్యక్తిగత భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, అందుకే వాటికి దూరంగా ఉండాలని పేర్కొన్నది. నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని, ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు, దానిపై స్పందించే ముందు ఆ సమాచారంపై పూర్తి అవగాహన ఉండాలని, జాగ్రత్త వహించాలని సూచించింది.

Delhi Police
పాకిస్తాన్ సోషల్ మీడియాల నిలిపివేత
ఈ ఆందోళనల నేపథ్యంలో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ సోషల్ మీడియాలను నిలిపివేశామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఆ దేశానికి చెందిన సుమారు 480 సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశామని వారు తెలిపారు. ఆ దేశ సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారాన్ని, తప్పుదోవ పట్టించే పోస్టులను వ్యాప్తి చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇలాంటి నిజం కాని కంటెంట్‌కు దూరంగా ఉండాలని, వాటికి బలి కావద్దని వారు సూచించారు.