న్యూఢిల్లీ: నిరసన చేస్తున్న విద్యార్థులను దేశ శత్రువులుగా మోదీ ప్రభుత్వం పరిగణిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. (Sonia Gandhi) విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బహిరంగంగా తోసిపుచ్చడం ద్వారా జవాబుదారీతనం పట్ల ధిక్కారాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. నీట్ లీక్ వివాదంపై విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ సోనియా గాంధీ రాసిన ఒక ఆర్టికల్ ‘ది హిందూ’ పత్రికలో శుక్రవారం ప్రచురితమైంది. విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం, విద్యా సంస్కరణలను విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అయితే మోదీ ప్రభుత్వం వారి ధైర్యానికి పిరికితనంతో, విచక్షణారహిత క్రూరత్వంతో స్పందించిందని, విద్యార్థులను భవిష్యత్తు వారసులుగా కాకుండా దేశ శత్రువులుగా చూస్తోందని ఆరోపించారు.
కాగా, జూలై 20న ఢిల్లీ పోలీసులు, సాయుధ పోలీస్ బలగాల లాఠీచార్జ్, బాష్ఫాయువు ప్రయోగం వంటి హింసాత్మక చర్యల ద్వారా విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నించడం కేంద్ర ప్రభుత్వం ‘అపఖ్యాతి పాలైన రోజు’గా సోనియా గాంధీ అభివర్ణించారు. కేంద్ర హోం మంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది విద్యార్థి నిరసనకారులపై ప్రదర్శిస్తున్న ‘క్రూరత్వం’ ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదన్నారు. ‘2020లో సీఏఏ-ఎన్ఆర్సీ వ్యతిరేక నిరసనల సమయంలో సాయుధ పోలీసులు, పారామిలిటరీ బలగాలు విశ్వవిద్యాలయ ప్రాంగణాలను ఎలా ధ్వంసం చేశాయో మనందరికీ స్పష్టంగా గుర్తుంది. భారత మహిళా రెజ్లర్లపై జరిగిన ఆమోదయోగ్యం కాని దురాగతాలను మన జ్ఞాపకాల నుంచి ఎప్పటికీ చెరిపివేయలేం’ అని పేర్కొన్నారు.
మరోవైపు విద్యార్థుల నిరసనలను బలహీనపరచడానికి, అసమ్మతిని దేశద్రోహంగా ముద్ర వేసే పాత ‘సాధనాలను’ కేంద్ర ప్రభుత్వం తిరిగి ఉపయోగించినట్లు సోనియా గాంధీ విమర్శించారు. నిరసనలకు దారితీసిన తన విధానాలపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన మోదీ ప్రభుత్వం, నిందలు వేయడానికి, కుట్రలను ప్రచారం చేయడానికి తన కుతంత్రాలన్నింటినీ ప్రయోగించిందని దుయ్యబట్టారు.
భారతదేశ విద్యా రంగాన్ని కేంద్ర ప్రభుత్వం క్షీణింపజేస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. కేవలం నిరాశను మాత్రమే కలిగించే నేటి నిరాశాజనకమైన విద్యా వాతావరణం, మోదీ ప్రభుత్వానికి అలవాటైన అహంకారం, జవాబుదారీతనం లేదా నిర్మాణాత్మక వైఖరి లేకపోవడం అనే ఈ పరస్పర సంబంధిత శక్తుల సహజ పర్యవసానమే విద్యార్థుల నిరసనలని స్పష్టం చేశారు. దేశ విద్యార్థులు మోదీ ప్రభుత్వ బూటకపు మాటలను బట్టబయలు చేశారని పేర్కొన్నారు.
కాగా, ప్రభుత్వ విద్య నుంచి మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయడమే మొట్టమొదటి ప్రాథమిక సమస్య అని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. పాఠశాల విద్యపై తన మొత్తం బడ్జెట్లో కేటాయించే వాటాను 50 శాతం, ఉన్నత విద్యపై 33 శాతం తగ్గించిందని విమర్శించారు. ‘ఇంతటి అసంబద్ధమైన వెనకడుగులో ఎవరికైనా అర్థం కనిపిస్తుందా?’ అని ప్రశ్నించారు.
అలాగే గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి, 43,000 ప్రైవేట్ పాఠశాలల ప్రారంభాన్ని పర్యవేక్షించిందని సోనియా గాంధీ ఆరోపించారు. వీటిలో అధిక భాగం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్నాయని తెలిపారు. ‘యాదృచ్ఛికంగా, ఈ సంస్థ తన అనుబంధ సంస్థలతో కలిసి భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్వర్క్ను నిర్వహిస్తోంది’ అని విమర్శించారు. నాణ్యమైన, సరసమైన ప్రభుత్వ విద్య అందుబాటులో లేకపోవడంతో దేశంలోని కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం సొంతంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తోందని పేర్కొన్నారు.
అయితే ఎన్టీఏను బలోపేతం చేయాలన్న పార్లమెంటరీ విద్యా స్థాయీ సంఘం సిఫార్సులను, అందులో ప్రతిపక్ష సభ్యులు ఉన్నారనే ఏకైక కారణంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బహిరంగంగా తోసిపుచ్చడం ద్వారా జవాబుదారీతనం పట్ల ధిక్కారాన్ని ప్రదర్శించారని సోనియా గాంధీ ఆరోపించారు. ఇన్ని ఘోర వైఫల్యాలు ఎదురైనా పదవికి రాజీనామా చేయడానికి ఆయన విముఖత చూపడం ప్రజాభిప్రాయాన్ని మరింత రెచ్చగొట్టిందని విమర్శించారు. విద్యార్థులకు అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం ఒక నైతిక, రాజకీయ, రాజ్యాంగపరమైన బాధ్యత అని సోనియా గాంధీ స్పష్టం చేశారు.