NIA raids : జాతీయ దర్యాప్తు సంస్థ (National Investigation Agency-NIA) దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిలో ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai), హర్యానా (Haryana), ఉత్తరప్రదేశ్ (Uttarpradesh), రాజస్థాన్ (Rajasthan), ఛత్తీస్‌గఢ్ (Chattishgarh), అస్సాం (Assam), పశ్చిమ బెంగాల్ (West Bengal) ఉన్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన నివాస గృహాలు, ఆఫీస్‌లు వీటిలో ఉన్నాయి.
ఎన్ఐఏ తనిఖీల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు. కొన్ని సున్నితమైన ఆర్థిక పత్రాలు కూడా జాతీయ దర్యాప్తు సంస్థకు దొరికాయి. పాకిస్థాన్ నుంచి గూఢచర్యం రాకెట్‌ను నడిపిస్తున్న ఆపరేటివ్‌ల సమాచారాన్ని తెలుసుకోవడానికి వీటిని విశ్లేషిస్తామని అధికారులు వెల్లడించారు. గూఢచర్యానికి అవసరమైన ఆర్థిక సహకారాలు వీరి నుంచి అందినట్లు తాము అనుమానిస్తున్నామన్నారు.
కాగా మే 20న జాతీయ దర్యాప్తు సంస్థ ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు 2023 నుంచి పాక్‌కు సున్నితమైన సమాచారాన్ని సేకరించి పంపిస్తున్నట్లు గుర్తించారు. వీటిల్లో జాతీయ భద్రతకు ముప్పుగా మారే అంశాలు కూడా ఉన్నాయి. అతడికి భారత్‌లోని పలువురు వ్యక్తుల నుంచి నిధులు అందేవి. ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా పలువురిని గూఢచర్యం కేసులో దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి.
ఈ క్రమంలో కాసిం అనే వ్యక్తిని అరెస్టు చేశారు. సున్నితమైన సమాచారాన్ని అతడు పాకిస్థాన్‌కు చేరవేసినట్లు తెలుస్తోంది.