గజ్వేల్, మార్చి 9: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రధాన రోడ్లను నాలుగు వరుసలుగా చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పట్టణంలోని ప్రధాన మార్గాల్లోని రోడ్లను రింగ్‌రోడ్డుకు అనుసంధానంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే పనులు ప్రారంభమైన కోటమైసమ్మ, సంగాపూర్ రోడ్ల పనులు కొన్ని కారణాలతో మధ్యనే ఆగిపోయాయి. కోటమైసమ్మ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా మారడంతో ఇంకెప్పుడు రోడ్డు పనులు పూర్తయ్యేనని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంపై సంబంధిత ఆర్అండ్బీ అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి పనులు పూరి ్తచేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.
గజ్వేల్ పట్టణంలో..
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు నుంచి కోటమైసమ్మ దేవాలయం వరకు 2.9 కిలోమీటర్లు నాలుగు వరుసలుగా రోడ్డు నిర్మాణం చేపట్టి విభాగిని మధ్యలో వీధిదీపాలు ఏర్పాటు చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రూ.12కోట్లు మంజూరు చేసింది. అప్పట్లో ఇందిరాపార్కు నుంచి పాత ఎంపీడీవో కార్యాలయం వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తవగా అక్కడ నుంచి ఇండ్ల కుల్చివేత ఆలస్యమవడంతో కోటమైసమ్మ దేవాలయం వరకు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. రోడ్డు పనులు పూర్తవకపోవడంతో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కోటమైసమ్మ దేవాలయం మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది.
అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద డివైడర్‌కు ఇరువైపులా కూరగాయల అమ్మకాలు చేపడుతుండడంతో రోడ్డుకు ఇరువైపులా దుకాణాదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కోటమైసమ్మ దేవాలయం మార్గంలోని పాత ఎంపీడీవో కార్యాలయం వరకే మురుగుకాల్వ నిర్మాణం చేపట్టడంతో అక్కడి నుంచి మురుగునీరు రోడ్డు పక్కనే పారుతుండడం.. దుర్వాసనతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ కోసం సుమారు వందకు పైగా ఇండ్లను కుల్చివేశారు. రోడ్డు పనులను పూర్తి చేయకపోవడంతో చాలామంది సగం కుల్చిన ఇండ్లలోనే నివాసం ఉంటున్నారు. రోడ్డు మొత్తం పూర్తయితే కూల్చిన ఇండ్లకు మరమ్మతులు చేసుకుందామని చూస్తే పనులు మందుకు సాగడం లేదు. వెంటనే ఆర్అండ్బీ అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.

సంగాపూర్ కమాన్ దారిలో…
సంగాపూర్ కమాన్ మార్గంలో ఇరుకైన రోడ్డుతో పట్టణవాసులు, వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కమాన్ నుంచి సుమారు వంద మీటర్ల వరకు రోడ్డు నిర్మాణ పనులు గతంలోనే మధ్యలో ఆగిపోవడంతో సమస్య తీవ్రంగా మారింది. సంగాపూర్ కమాన్ మార్గంలో నిత్యం ఆర్అండ్ఆర్ కాలనీ వాసులు, సంగాపూర్, వర్గల్ మండలంలోని ఇతర గ్రామాలకు వెళ్లే ప్రజలు, ఎడ్యుకేషన్ హబ్‌కు వెళ్లే విద్యార్థులు, ఐవోసీ కార్యాలయానికి వెళ్లే అధికారులు ఇదే మార్గంలో వెళ్తుంటారు. రోడ్డుపైనే చిరువ్యాపారులు తోపుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేస్తుండటంతో నిత్య ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటై రెండున్నరేండ్ల కాలంలో కనీసం అసంపూర్తిగా మిగిలిన పనులపై దృష్టి సారించకపోవడంతో పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో రింగ్‌రోడ్డు వద్ద అసంపూర్తి పనులు మిగలడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.