Viral news : ఓ ప్రేమికుడికి దరిద్రం లాటరీ (Lottery) రూపంలో తగిలింది. లాటరీ ప్రైజ్‌మనీ రూ.30 కోట్లు అందడంతో ఆ డబ్బుతో ప్రియురాలితో హాయిగా గడపొచ్చని కలలు కన్నాడు. కానీ డబ్బు చేతికి అందిన తర్వాత ప్రియురాలు చేసిన పని అతడి మైండ్‌ను బ్లాక్ చేసింది. ఆమె లాటరీ సొమ్ము తీసుకుని కొత్త ప్రియుడితో లేచిపోయింది. షాక్ నుంచి తేరుకున్న ప్రియుడు ఇప్పుడు కనీసం తన సొమ్మునైనా తనకు ఇప్పించాలని కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కెనడాలోని విన్నిపెగ్‌కు చెందిన లారెన్స్ కాంపెల్ 2024లో ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ లాటరీలో అతడు రూ.30 కోట్లు గెలుచుకున్నాడు. కానీ తన వద్ద సరైన ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా లేకపోవడంతో తన ప్రియురాలు క్రిస్టల్ ఆన్ మెక్కే వివరాలను అధికారులకు ఇచ్చాడు. ప్రైజ్‌మనీని ఆమె ఖాతాలోకి బదిలీ చేయించాడు. అప్పటిదాకా అతడితో సన్నిహితంగా మెలిగిన ఆమె.. డబ్బు చేతికి అందగానే తన అసలు రంగు బయటపెట్టింది.
ఏకంగా రూ.30 కోట్ల డబ్బు తీసుకుని కొత్త ప్రియుడితో పరారైంది. అంతేకాదు మాజీ ప్రియుడు కాంపెల్ తనను ఏ రకంగానే సంప్రదించే అవకాశం లేకుండా జాగ్రత్త పడింది. ఆమె మోసాన్ని గ్రహించిన లారెన్స్ కాంపెల్ కోర్టును ఆశ్రయించాడు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరాడు. ఏడాది నుంచి ఆమెతో రిలేషన్లో ఉన్నానని, జీవితమంతా క్రిస్టల్తోనే అని నిర్ణయించుకున్నానని కోర్టుకు తెలిపాడు. కొంతకాలంగా లాటరీ టికెట్ కొనాలని ఆమె తనను ప్రోత్సహించిందని, అందులో విజేతగా గెలువడంతో ఆమెపై పూర్తి విశ్వాసం ఉంచి ఆమె వివరాలు అధికారులకు ఇచ్చానని చెప్పాడు.
ఆ తర్వాత కొంతకాలం క్రిస్టల్ తనతో సన్నిహితంగానే ఉందని కాంపెల్ తెలిపాడు. ఒక రోజు హోటల్‌కి వెళ్లగా.. ఆమె అక్కడి నుంచి పరారైందని, ఎన్ని విధాలుగా ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని అన్నాడు. దాంతో వేరే దారిలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించానని లారెన్స్ కాంపెల్ ఆవేదన వ్యక్తం చేశాడు.