గురువారం 04 జూన్ 2020
International - Apr 30, 2020 , 01:47:45

4 దశల్లో ఎగ్జిట్‌ ప్లాన్‌!

4 దశల్లో ఎగ్జిట్‌ ప్లాన్‌!

  • పక్కాగా అమలు చేస్తున్న చెక్‌ రిపబ్లిక్‌.. ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు

లండన్‌/వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 29: వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసి, లాక్‌డౌన్‌ నిబంధనల్ని వ్యూహాత్మకంగా సడలిస్తున్న ఐరోపా దేశం చెక్‌ రిపబ్లిక్‌ నిర్ణయాలను బ్రిటన్‌తో పాటు పలు దేశాలు పరిశీలిస్తున్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా మార్చి 11న చెక్‌ రిపబ్లిక్‌ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. దీంతోపాటు నిర్ణీత దూరాన్ని పాటించడం వంటి కఠిన చర్యల్ని తీసుకున్నది. దీంతో దేశంలో 7,400 వైరస్‌ కేసులు, 221 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. కాగా లాక్‌డౌన్‌లో సడలింపులనిచ్చేందుకు చెక్‌ రిపబ్లిక్‌ నాలుగు దశల్లో ఎగ్జిట్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఆ వివరాలు.. 


 మొదటి దశ:  

రిటైల్‌ దుకాణదారులకు వెసులుబాటు 

ఎగ్జిట్‌ ప్లాన్‌లో భాగంగా రిటైల్‌ దుకాణదారులు, కారు డీలర్లకు అనుమతులనిచ్చింది. ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులకు వెసులుబాటు కల్పించింది.  శుభకార్యాలకు పది మందికి మించి హాజరుకావద్దని పేర్కొంది. ఈ దశ సడలింపులు ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వచ్చాయి. 


 రెండో దశ:  

లైబ్రరీ, డ్రైవింగ్‌ స్కూళ్లకు అనుమతి  

సోమవారం నుంచి మొదలైన రెండో దశలో 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఉండే దుకాణాల (మధ్యశ్రేణి దుకాణాలు) కార్యకలాపాలకు, డ్రైవింగ్‌ స్కూల్స్‌, చర్చిలను తెరువడం ( 15 మందికే అనుమతి), జిమ్‌లు, లైబ్రరీలు, జూలు, బొటానికల్‌ గార్డెన్‌లకు అనుమతులనిచ్చింది. 


  మూడో దశ:  

మాల్స్‌ తెరువచ్చు

మే 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడో దశలో మాల్స్‌లోని రిటైల్‌ స్టోర్లు, మాల్స్‌ బయట ఉండే 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణం కంటే పెద్ద దుకాణాలు, బ్యూటీ సెలూన్లు, మసాజ్‌ పార్లర్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో టేక్‌ అవే సర్వీసులు, మ్యూజియం, గ్యాలరీలు తెరిచేందుకు అనుమతులిచ్చింది. 

 నాలుగో దశ: 

థియేటర్లు, టాక్సీలకు అనుమతి

మే 25న ప్రారంభమయ్యే ఆఖరి దశలో రెస్టారెంట్లు, బార్లు, కేఫ్‌లను పూర్తి స్థాయిలో ప్రారంభించడం, హోటళ్లు, థియేటర్లు, టాక్సీలకు అనుమతులనిచ్చింది. అయితే, ఈ ఎగ్జిట్‌ ప్లాన్‌ అమలయ్యేటప్పుడు ప్రజలంతా మాస్కులు ధరించి, నిర్ణీత దూరాన్ని పాటించాలని, పది మందికి మించి గుమిగూడవద్దని హెచ్చరించింది. చెక్‌ రిపబ్లిక్‌ ఎగ్జిట్‌ ప్లాన్‌ సత్ఫలితాలనిస్తున్నది. ఈ ప్లాన్‌ను తమ దేశాల్లో కూడా అమలు చేయడానికి  పలు దేశాలు ఆలోచనలు చేస్తున్నాయి. 

న్యూయార్క్‌లో లాక్‌డౌన్‌ సడలింపు వ్యూహకర్తలుగా మనోళ్లు!

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ రాష్ట్రం ఓ సలహా బృందాన్ని నియమించింది. దీంట్లో భారత సంతతికి చెందిన మాస్టర్‌ కార్డ్‌ సీఈవో అజయ్‌ బంగా, టండన్‌ క్యాపిటల్‌ అసోసియేట్స్‌ చైర్‌పర్సన్‌ చంద్రికా టండన్‌, హోటల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ సిటీ సీఈవో విజయ్‌ దండపాణి కూడా ఉన్నారు.


  ప్రజారవాణా వ్యవస్థలో ఇలా.. 

లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలోనన్న అంశంపై పలు దేశాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఆంక్షలు సడలించిన తర్వాత బస్సులు, రైళ్లలో ప్రజలు గుంపులుగా ప్రయాణించకుండా పలు దేశాలు పరిష్కార మార్గాల్ని సూచిస్తున్నాయి. 

  • బస్సులు ఎక్కే ప్రయాణికులు ముందు ద్వారం నుంచి గాకుండా.. వెనుక ద్వారం నుంచి బస్సులోకి ఎక్కాలని, ఈ విధంగా చేస్తే బస్సు డ్రైవర్లకు వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుందని బ్రిటన్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నది. 
  • బస్సు స్టాపులో నిల్చునే ప్రయాణికులు నిర్ణీత దూరం పాటించేలా నేలపై ఎరుపు రంగు స్టిక్కర్లను అంటించే విధానాన్ని ఇటలీ ప్రభుత్వం తీసుకొచ్చింది. 
  • రైళ్లలో ప్రయాణించేవారు ఎక్కువగా ఉంటారని భావించిన జర్మనీ సర్కారు.. సాధారణం కంటే ఎక్కువ బోగీలను ఏర్పాటు చేస్తూ, పరిమిత సంఖ్యలో ప్రయాణికులను అనుమతిస్తున్నది. సైకిలుపై ప్రయాణించే వారికి ప్రత్యేక రూట్లను కూడా ఏర్పాటు చేస్తున్నది. 


logo