ఆదివారం 24 జనవరి 2021
Hyderabad - Nov 04, 2020 , 06:40:14

వాహనదారులూ.. జాగ్రత్తా..!

వాహనదారులూ.. జాగ్రత్తా..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్‌ నిబంధనలను సరిగ్గా పాటించకపోయినా.. మనల్ని ఎవరు చూస్తారులే అనుకుంటున్నారా...చలాన్‌ ఎవరు వేస్తారులే అని కొట్టిపారేస్తున్నారా...అయితే కొద్దిగా తగ్గండి..ఎందుకంటే మీ ఉల్లంఘనలను దాదాపు 10 వేల సీసీ కెమెరాలు గమనిస్తున్నాయి. దాదాపు 130 జంక్షన్‌లలోని వాహనాల రాకపోకలు, వాహనదారుల నిబంధనల ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు కనిపెడుతున్నాయి. చలాన్‌లను జారీ చేస్తున్నాయి. అంతేగానీ ట్రాఫిక్‌ పోలీసు లేడు కదా అని పొరపాటు పడితే మీ వాహనంపై చలాన్‌ ముద్రణ నిఘా కళ్ల ద్వారా జరిగిపోతుంది. మంగళవారం ఓ బడాబాబు తన కారుకు నంబర్‌ ప్లేటు ఉన్నా.. దాన్ని పెట్టుకోకుండా, మొత్తం బ్లాక్‌ ఫిలిం వేసుకుని తిరుగుతున్నాడు. సైబర్‌ టవర్స్‌ వద్ద సిగ్నల్‌ పడటంతో ఆగింది. ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసు అధికారికి ఆదేశాలు వెళ్లాయి. వెంటనే ఆ అధికారి వెళ్లి.. నల్ల రంగు కారుకు నంబర్‌ ప్లేట్‌ లేకపోవడంతో దాన్ని  పక్కకు తీసి పరిశీలించారు. నంబర్‌ ప్లేటు ఉన్నా పెట్టుకోలేదని తేలింది. దీనికితోడు నిబంధనలకు విరుద్ధంగా అద్దాలకు బ్లాక్‌ ఫిలిం వేయించుకున్నాడని తెలిసింది. ఈ రెండు ఉల్లంఘనలపై ఎంవీ యాక్ట్‌ కింద కేసులను నమోదు చేయడంతో పాటు నంబర్‌ ప్లేటును ఇంటి నుంచి తీసుకువచ్చి బిగించే వరకు కారును రిలీజ్‌ చేయలేదు. బిగించుకున్న తర్వాత కారును వదిలిపెట్టారు. కావునా వాహనదారులు తస్మాత్‌ జాగ్రత్తా... ట్రాఫిక్‌ పోలీసులు కనిపెట్టలేకపోయినా.. నిఘా నేత్రాలు మాత్రం మీ ఉల్లంఘనలను వదిలిపెట్టవు.


logo