గురువారం 28 మే 2020
Hyderabad - May 19, 2020 , 00:58:41

కరోనాతో హైదరాబాద్ ఎస్‌బీఐ ఉద్యోగి మృతి

 కరోనాతో హైదరాబాద్ ఎస్‌బీఐ ఉద్యోగి మృతి

హైదరాబాద్  : కాచిగూడ నింబోలిఅడ్డ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(55) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కోఠి బ్యాంక్‌ స్ట్రీట్‌ శాఖలో హెడ్‌ మెసెంజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు ఈనెల 12 నుంచి నిమోనియాతో బాధపడుతూనే విధులకు హాజరయ్యాడు. ఐతే 14న వ్యాధి తీవ్రం కావడం, అలసట, జ్వరం రావడాన్ని గమనించిన బ్యాంకు అధికారులు వైద్యపరీక్షలు చేయించుకోమని సూచించా రు. దీంతో ఓ ప్రైవేట్‌ క్ల్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ వైద్యసేవలు అందించినా ఫలితం లేకపోవడంతో కరోనాగా అనుమానించి గాంధీ దవాఖానకు వెళ్లాలని సూచించాడు. 16న గాంధీ దవాఖానకు వెళ్లాడు. అక్కడి వైద్యులు శాంపిల్స్‌ను సేకరించి పంపగా కరోనా పాజిటివ్‌ అని తేలింది.

 వ్యాధి నిర్ధారణ అయిన గంటల వ్యవధిలోనే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇసామియాబజార్‌ యూపీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ దీప్తి ప్రియాంకకు సమాచారం అందడంతో ఆమె వైద్యసిబ్బంది, సుల్తాన్‌బజార్‌ ఎస్‌ఐ చంద్రమోహన్‌తో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబంలో నివసించే 8మందిని హోంక్వారంటైన్‌ చేశారు. అదేవిధంగా క్లినిక్‌లో వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యుడితోపాటు ఇద్దరు సిబ్బందిని, మృతుడు విధులకు హాజరైన బ్యాంకు శాఖకు చెందిన 63 మంది అధికారులు, సిబ్బందిని వారి నివాసాల్లో హోం క్వారంటైన్‌ చేశారు. మొత్తం 74మందిని హోం క్వారంటైన్‌ చేశారు. ఆ ఉద్యోగికి కరోనా ఏ విధంగా వచ్చిందని అధికారులు ఆరా తీస్తున్నారు.  

ఒకే  కుటుంబంలో  9 మందికి... 

మాదన్నపేట:  కుర్మగూడ మూడుగుళ్లు ఆలయం వద్ద ఒకే కుటుంబంలోని 9 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం 78 ఏండ్ల వృద్ధుడు అస్వస్థతకు గురికావడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. అతడికి పాజిటివ్‌ వచ్చింది. కాగా సోమవారం వృద్ధుడి కుటుంబంలోని 9 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్‌ వచ్చింది.  

 శివలాల్‌నగర్‌లో నలుగురికి.. 

అబిడ్స్‌/జియాగూడ:  ధూల్‌పేట్‌ శివలాల్‌నగర్‌లో మరో నలుగురికి కరోనా సోకింది. ఆరు రోజుల కిందట బీఎస్‌ఎన్‌ఎల్‌లో కార్మికురాలిగా పనిచేసే మహిళ(60)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు ఆమె నివాసంలోని 20మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరు కోడళ్లు, ఆమె కుమార్తె (26) మనవరాలు(10) నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

జియాగూడ లక్ష్మీనరసింహనగర్‌లో ముగ్గురికి.. 

జియాగూడ లక్ష్మీనరసింహనగర్‌లో ఉండే ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కబేళాలో కమిషన్‌ ఏజెంట్‌కు ఆరు రోజు ల కిందట పాజిటివ్‌రావడంతో అతడిని గాంధీకి తరలించారు. కాగా అతడి వాచ్‌మెన్‌ కుటుంబసభ్యులపై అనుమానం రావడం తో వైద్యులు శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు.

 పాపిరెడ్డికాలనీలో వ్యక్తికి...

శేరిలింగంపల్లి:  పాపిరెడ్డికాలనీలో ఆశ వర్కర్లు సర్వే నిర్వహిస్తుండగా..ఓ వ్యక్తి(29) జ్వరం,దగ్గుతో బాధపడుతున్నట్లుగా తేలడంతో వారు కొవిడ్‌ బృందానికి సమాచారమిచ్చారు. ఎర్రగడ్డ నేచర్‌క్యూర్‌కు తరలించారు. అక్కడ కరోనా పాజిటివ్‌  రావడంతో గాంధీ దవాఖానకి తరలించారు. 

 సైఫ్‌కాలనీలో తల్లీకూతురుకు...

పహాడీషరీఫ్‌: సైఫ్‌కాలనీలో తల్లీకూతురుకు కరోనా పరీక్షలో పాజిటివ్‌ వచ్చిందని బాలాపూర్‌ ఆరోగ కేంద్రం సూపర్‌వైజర్‌ గోవింద్‌రెడ్డి తెలిపారు. అంతకుముందే తండ్రికి పాజిటివ్‌ రాగా సోమవారం తల్లీకూతురుకు పాజిటివ్‌ వచ్చింది. గాంధీకి తరలించారు. 


logo