e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News Omicron | ఒమిక్రాన్ పిల్ల‌లపై ప్ర‌భావం చూపిస్తుందా? ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలేంటి?

Omicron | ఒమిక్రాన్ పిల్ల‌లపై ప్ర‌భావం చూపిస్తుందా? ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలేంటి?

Will Omicron Infect Kids | డెల్టాతో పోలిస్తే.. వేషాలు మార్చడంలో రెండాకులు ఎక్కువే చదువుకుంది. జిత్తులమారితనంలో రాటుదేలిపోయింది. చిన్న పిల్లలనూ వదిలిపెట్టదు. పరీక్షలు చేసినా రోగ లక్షణాలను బయటికి రానివ్వదు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌.. హిందుస్థాన్‌ వైపు వేగంగా అడుగులు వేస్తున్నది.

కరోనా… పేరు చెబితేనే ప్రపంచమంతా వణికిపోతుంది. దాదాపు రెండేండ్లుగా జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మహమ్మారి ఊసరవెల్లిలా రోజుకో రూపం మార్చుకుంటున్నది. రెండో దశ తరువాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల మీదికి..ఒమిక్రాన్‌ పేరుతో మెరుపుదాడి చేస్తున్నది. దక్షిణాఫ్రికాలో మొదట వెలుగు చూసిన ఈ కరోనా కొత్త వేరియంట్‌.. రెండో దశలో వార్తలకెక్కిన డెల్టా వేరియంట్‌ కంటే వేగంగా వ్యాపిస్తున్నది. దీనిలో కొన్ని ప్రమాదకర లక్షణాలు ఉన్నందున ఒమిక్రాన్‌ను ‘ వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌ ( variant of concerns ) ’గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ). ఈ వైరస్‌ వల్ల పెద్దగా ప్రాణ నష్టం లేకపోయినా.. ఒకరి నుంచి మరొకరికి వాయువేగంతో వ్యాపిస్తుందని మాత్రం వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది చిన్నపిల్లలను సైతం వదలడం లేదు. దక్షిణాఫ్రికాలో 5 ఏండ్ల లోపు పిల్లలు ఎక్కువగా ఒమిక్రాన్‌ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులకు ఇది ఆందోళన కలిగించే అంశమే.

కొత్త కొమ్ములతో

- Advertisement -

కరోనా వైరస్‌లోని స్పైక్స్‌ (కొమ్ములు) రోగిని అనారోగ్యానికి గురిచేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రూపం మార్చుకుని వచ్చిన ఒమిక్రాన్‌లో కొమ్ములు మరింత పెరిగి, ఇంకొంత పదునుదేలాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టాతో పోల్చితే ఈ వేరియంట్‌లో 50కి పైగా ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్‌) వచ్చాయి. ఇందులో ముఖ్యంగా 32 కేవలం కొమ్ములలోనే వచ్చాయి. గతంతో పోలిస్తే కొమ్ముల సంఖ్యా పెరిగింది.

వాయు వేగంతో

ఉత్పరివర్తనాల ప్రభావంతో కొత్త వేరియంట్‌లో ‘ఆర్నాట్‌ విలువ’ (వైరస్‌ వేగానికి కొలమానం) పెరిగింది. ఈ విలువ ‘చిన్న అమ్మవారు’ (మీజిల్స్‌) కంటే అధికం. ఆ లెక్క ప్రకారం.. మీజిల్స్‌ కంటే కూడా ఒమిక్రాన్‌ వేరియంటే వేగంగా విస్తరిస్తుంది. అతి తక్కువ వ్యవధిలోనే విశ్వమంతా వ్యాపిస్తూ ఉండటమే ఇందుకు ఒక నిదర్శనం.

రోగ నిరోధక శక్తిని ఢీకొంటూ..

కొత్త వేరియంట్‌లో కొమ్ముల సంఖ్య పెరగడం వల్ల ‘విరులెన్స్‌’ (వ్యాధి ప్రమాద స్థాయి) కూడా పెరిగింది. అంటే, ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువే. ఇమ్యూనిటీని ఛేదించే
అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారినీ వదలదు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో వైరస్‌ ప్రభావం తక్కువగాను, తీసుకోని వారిలో కొంత అధికంగాను ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ వేరియంట్‌ స్వభావంపై పూర్తిస్థాయి స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.

Omicron variant

మందుల పనితీరు ప్రశ్నార్థ‌కమే..

ఒమిక్రాన్‌ వేరియంట్‌కు రోగ నిరోధక శక్తిని తట్టుకుని విజృంభించే శక్తి ఉంది. దీంతో యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ ప్రభావం కొంత తగ్గవచ్చు. సింథటిక్‌ యాంటీ బాడీస్‌ (కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌) కూడా పెద్దగా పనిచేయక పోవచ్చు. దీనికి సంబంధించి మరింత స్పష్టత కోసం, కొంత కాలం నిరీక్షించాల్సిందే.

చాపకింద నీరులా

పాత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ లక్షణాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావానికి గురైన 80శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించడం లేదు. అంటే వైరస్‌ సోకినవారు ఎసింప్టమాటిక్‌గా ఉంటున్నారు. ఇది ఆందోళనకరమైన విషయమే. ఎందుకంటే, లక్షణాలు కనిపిస్తే ఎంతో కొంత అప్రమత్తం అవుతాం. లేదంటే, చాపకింద నీరులా విస్తరిస్తూ పోతుంది. అదే జరుగుతున్నదిప్పుడు. కొంత ఉపశమనం కలిగించే అంశం ఏమిటంటే.. ఈ వేరియంట్‌ గతంలో మాదిరిగా ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపడం లేదు. రోగులకు శ్వాస సమస్యలు ఎదురుకావడం లేదు. దీంతో కృత్రిమ ఆక్సిజన్‌ అవసరం లేకపోవచ్చన్నది ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. డెల్టా వేరియంట్‌ మాదిరిగా రుచి, వాసన కోల్పోయే పరిస్థితీ లేదు. కానీ, ఈ విషయాన్ని సాధికారికంగా ప్రకటించాలంటే, మరిన్ని కేసులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

థర్డ్‌వేవ్‌కు దారితీయవచ్చు

ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి, మరింత ఎక్కువమందికి సోకే ప్రమాదం ఉంది. ఈ విస్తరణ థర్డ్‌ వేవ్‌గా పరిణమించే అవకాశాలూ లేకపోలేదు. మరో విధంగా చూస్తే దీన్ని అంతర్జాతీయంగానూ మూడో దశ ( థర్డ్‌వేవ్‌ ) గా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ వేరియంట్‌ ముందు ఒక దేశంలో మొదలై వెనువెంటనే 30 దేశాలకు పైగా వ్యాపించింది. ప్రభావిత దేశాల రోగులను గమనిస్తే.. వైరస్‌ తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. కానీ రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేం. ముందు జాగ్రత్తలు పాటించడం మినహా మరో మార్గం లేదు.

Omicron variant in children
Will Omicron Infect Kids

పిల్లలూ ప్రభావితులే

గత వేరియంట్స్‌ పిల్లల జోలికి వెళ్లలేదు. కానీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో నమోదు అవుతున్న కేసులను పరిశీలిస్తే.. ఒమిక్రాన్‌ పిల్లలపైనా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తున్నది. 5 ఏండ్లలోపు పిల్లలు, 15 నుంచి 19 ఏండ్లలోపు బాలబాలికలు హాస్పిటల్స్‌లో చికిత్స కోసం ఎక్కువగా చేరుతున్నట్టు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ నిపుణులు వెల్లడించారు. అయితే, మన దేశానికి వచ్చేసరికి.. ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

బూస్టర్‌ డోస్‌ అవసరమే

ఏ వ్యాక్సిన్‌ అయినా సరే, కొంత కాలం తరువాత దాని వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీస్‌ తగ్గిపోతాయి. ఈ సూత్రం ప్రకారం చూస్తే.. ప్రస్తుతం అందరికీ కరోనా బూస్టర్‌ డోస్‌ అవసరమే. రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా బూస్టర్‌ డోస్‌ మంచిదే. వాస్తవానికి బూస్టర్‌ డోస్‌ పనితీరుపై స్పష్టత లేదు. రెండు డోసులూ ఒకే రకమైన వ్యాక్సిన్‌ తీసుకున్న వారు, బూస్టర్‌ డోస్‌ కింద ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం రెండో డోసు తీసుకున్న 6 నెలల తరువాతే బూస్టర్‌ మంచిది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పిల్లల టీకాలు ఎంత త్వరగా మార్కెట్‌లోకి వస్తే అంత మేలు.

జాగ్రత్తలు

Dr. B.nagaraju
 • ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలి.
 • ముఖానికి మాస్క్‌, భౌతిక దూరం, శానిటైజర్‌ తప్పనిసరి.
 • సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
 • అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
 • సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దు. మానసిక ఒత్తిడికి గురైతే, రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.
 • అనుమానం వస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలి.
 • పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే వెంటనే ఐసొలేషన్‌లోకి వెళ్లిపోవాలి.
 • మధ్యస్థ, తీవ్ర లక్షణాలుంటే సొంత వైద్యం తీసుకోకుండా, వైద్యులను సంప్రదించాలి.
 • పౌష్టికాహారం తీసుకోవాలి.

ఒమిక్రాన్‌ లక్షణాలు

 • విపరీతమైన అలసట.
 • తీవ్రమైన తలనొప్పి.
 • గొంతులో గరగర, దురద.
 • పొడిదగ్గు.
 • ఒంటి నొప్పులు.
 • జ్వరం.

డాక్టర్‌ బి.నాగరాజ్‌ ,పల్మనాలజిస్ట్‌
పార్థివ్‌ లంగ్‌కేర్‌ సెంటర్‌ హైదరాబాద్‌

మహేశ్వర్‌రావు బండారి

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఒమిక్రాన్‌తో భారత్‌లో థర్డ్‌ వేవ్‌.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి కేసులు..!

కరోనా నుంచి కోలుకున్న వారికి ‘ఒమిక్రాన్‌’ ముప్పు ఎంత..? నిపుణులు ఏమంటున్నరు..?

omicron fears | ఒమిక్రాన్ భ‌యంతో భార్యాపిల్ల‌ల‌ను చంపేసిన డాక్ట‌ర్‌

ఒమిక్రాన్ వేరియంట్‌ ప్ర‌మాద‌క‌ర‌మా? దీన్ని ఎలా ఎదుర్కోవాలి?

Sowmya Swaminathan | ఒమిక్రాన్ రీఇన్‌ఫెక్ష‌న్ 3 రెట్లు.. పిల్ల‌ల‌కు ముప్పు.. ఇంకా..!

Omicron Fears | ఒమిక్రాన్ భ‌యాలు.. 2 రోజుల్లో రూ.5.8 ల‌క్ష‌ల కోట్లు హ‌రీ!

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement