హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): 16 మంది నిరుపేద వైద్య విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఫీజులకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపికచేసిన 16 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల ఫీజుల కోసం ఆర్థిక సాయం అందించారు. చెక్కుల పంపిణీ అనంతరం కేటీఆర్ మాట్లాడారు. వైద్య విద్యార్థుల చదువుకు బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని అభినందించారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా పేద విద్యార్థులు వైద్యులుగా ఎదిగేందుకు సహకారం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఏటా అనేకమంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. విద్యార్థులు సైతం బాగా చదువుకొని ఉన్నస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతోనే బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా అనేకమందికి ఆర్థిక సాయం చేస్తున్నామని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న వైద్య విద్యార్థులు భవిష్యత్లో మంచి వైద్యులుగా ఎదిగి సామాజిక సేవలో పాలుపంచుకోవాలని సూచించారు. కాగా, తమకు ఆర్థికంగా అండగా నిలిచిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి 16 మంది మెడికల్ స్టూడెంట్స్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పారు. వెన్నుతట్టి ప్రోత్సహించిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు.