కరోనా మహమ్మారి రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరిస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవడమే సరైన మార్గం. అయితే ఇప్పటికీ కరోనా టీకాపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ ఎన్ని డోసులు వేయించుకోవాలనే దానిపై ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు సరిపోదా? కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకోకపోతే ఏమవుతందంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా కట్టడికి ఎన్ని డోసులు వేసుకుంటే మంచిది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
వైరస్‌ను కట్టడి చేయాలంటే తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకోవాల్సిందేనని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో చెప్పిన దాని ప్రకారం.. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును ప్రైమ్ డోస్ అంటారు. మొదటి డోస్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీస్ పెరుగుతాయి. అయితే మొదటి డోస్ వేసుకున్నాక ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ ఎక్కువ కాలం ఉండలేవు. త్వరగానే క్షీణిస్తాయి. అందుకే 28 రోజుల వ్యవధిలో రెండో డోసు వేసుకోవాలి. ఈ రెండో డోస్‌ను బూస్టర్ డోస్ అంటారు. అంటే యాంటీ బాడీస్ ఉత్పత్తికి ఈ డోస్ బూస్ట్ ఇస్తుంది. దీనివల్ల శరీరంలో ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల కరోనా కట్టడిని బలమైన రక్షణ లభిస్తుంది. అలాగే మెమొరీ సెల్స్ కూడా ఉత్తేజితమవుతాయి. దీంతో కరోనా వైరస్ దాడిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటుంది. దీనివల్ల భవిష్యత్తులో మరోసారి వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు యాంటీబాడీస్‌ను ఉత్పత్తి అవుతుంటాయి. దీంతో ఎక్కువ కాలం కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండొచ్చు.
#COVID19Vaccine
— PIB in Maharashtra 🇮🇳 (@PIBMumbai) April 16, 2021
Is the first dose enough?
No, 2 doses are essential to give us protection.
Learn why & get yourself or your loved ones vaccinated
And remind your loved ones to get their 2nd dose promptly#Unite2FightCorona @MIB_India @ddsahyadrinews @airnews_mumbai pic.twitter.com/2z34RRPyfw
కరోనా వ్యాక్సిన్‌ను కచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గతంలోనే తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. కరోనా కట్టడి కోసం 28 రోజుల వ్యవధిలో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకవేళ నిర్ణీత సమయంలో రెండో డోస్ తీసుకోవడం కుదరకపోతే.. కనీసం ఆరు వారాల లోపు అయినా రెండో డోస్ కచ్చితంగా తీసుకోవాలని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి