మంగళవారం 11 ఆగస్టు 2020
Health - Jul 06, 2020 , 23:28:25

మోకాళ్ల నొప్పి..మాయం!

మోకాళ్ల నొప్పి..మాయం!

  • ఆపరేషన్‌ లేకుండానే

‘అక్కా.. గుడ్‌ న్యూస్‌'‘ఏంట్రా తమ్ముడూ..’ నిర్లిప్తంగా అంది నలభయ్యేండ్ల అనసూయ. మోకాలి నొప్పితో ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోతున్నది. హాస్పిటల్‌కి వెళ్తే కార్టిలేజ్‌ అరిగిపోయిందని చెప్పారు. మోకాలి మార్పిడి చేయాలన్నారు. ఆపరేషన్‌కి భయపడి ఇంటికి వచ్చేసింది. ‘నీ నొప్పి తగ్గే మార్గం దొరికిందక్కా... అదీ ఆపరేషన్‌ లేకుండానే. కొత్త ట్రీట్‌మెంట్‌ వచ్చిందట. మనమూ ఒకసారి వెళ్దాం’ ధైర్యం చెప్పాడు.అక్కడికి వెళ్లాక తెలిసింది.. కార్టిలేజ్‌ వల్ల కాకుండా సమస్య మరో దగ్గర ఉందని, బర్సా అనే భాగం బలహీనపడిందని. వెంటనే చికిత్స మొదలుపెట్టారు. త్వరలోనే ఫలితం కనిపించింది.

ఏ కారణం వల్ల మోకాళ్ల నొప్పి వచ్చినా పీఆర్‌పీ చికిత్స చేయించుకోవచ్చు. 

భుజం కీలు, మోచేయి, కాలి మడమ, పాదాల్లోని కీళ్ల సమస్యలకూ ఈ చికిత్స ప్రయోజనకరం.


అనసూయ విషయంలో ఏ అద్భుతమూ జరగలేదు. పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ రూపంలో వైద్యరంగం అందించిన వరమిది. పేరు.. రీజనరేషన్‌ థెరపీ. అరిగిపోయిన మోకాళ్లకు ఆపరేషన్‌ లేకుండా చికిత్స చేయగల ఈ వైద్య విధానం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది. 

రీజనరేషన్‌ థెరపీ అంటే?

మోకాలి కీలులో రెండు ఎముకల మధ్య కార్టిలేజ్‌ అనే మృదువైన కణజాలం ఉంటుంది. ఇది రెండు ఎముకల కదలికలు సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా వయసుతోపాటు, కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా కార్టిలేజ్‌ అరిగిపోతుంది. ఇలా కీలులో అరిగిపోయిన కార్టిలేజ్‌ను పునరుద్ధరించడమే రీజనరేషన్‌ థెరపీ. దీన్నే ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా (పీఆర్‌పీ) చికిత్స అని కూడా అంటారు. ఎందుకంటే, ఈ చికిత్స కోసం ప్లేట్‌లెట్లను ఉపయోగిస్తారు. ప్లేట్‌లెట్లు రక్తంలో ఉంటాయి. ఇవి గాయాన్ని మాన్పడంలో కీలకమైనవి. ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఆ భాగంలో కొత్తకణాలను సృష్టించి, దానికి మరమ్మతు చేయగల గుణం వీటికి ఉంటుంది. ప్లేట్‌లెట్లలో ఆల్ఫా-గ్రాన్యుల్స్‌ ఉంటాయి. వీటిలో గ్రోత్‌ ఫ్యాక్టర్లుంటాయి. ఇవి అరిగిపోయిన కార్టిలేజ్‌ పైన పని చేస్తాయి. ఫలితంగా, కొత్త కార్టిలేజ్‌ కణాలు తయారవుతాయి. 


మోకాలి చికిత్స కోసం..

మోకాలి నొప్పి విషయంలో ఆర్థరైటిస్‌ మొదటి రెండు గ్రేడ్‌లలో ఉన్నట్టయితే మూడు సిట్టింగ్‌లు సరిపోతాయి. మూడు, నాలుగు గ్రేడ్‌లలో ఉన్నట్టయితే నాలుగు సిట్టింగ్‌లు అవసరం అవుతాయి. ప్రతి పదిహేను రోజులకు ఒక సిట్టింగ్‌ తీసుకోవాలి. ఒక్కో సిట్టింగ్‌కి ఒకట్రెండు గంటలు పడుతుంది. సాధారణంగా మూడు నెలలకి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అందుకే చికిత్స అయ్యాక మూడు నెలలకి మళ్లీ స్కాన్‌ చేసి కార్టిలేజ్‌ ఎంతవరకు పెరిగిందో తెలుసుకుంటారు. ఇంకా నొప్పి ఉంటే నెలరోజులు ఆగి, ఇంకో సిట్టింగ్‌ ఏర్పాటు చేస్తారు. ఇది పూర్తిగా డే కేర్‌ చికిత్స. దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్లు ఉండవు. హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేదు. నొప్పి ఉండదు. ప్లేట్‌లెట్లను ఇస్తారు కాబట్టి గాయం సహజసిద్ధంగా మానుతుంది. కొత్త కణాలు ఏర్పడిన తర్వాత కార్టిలేజ్‌ 0.9 నుంచి 1 మి.మీ. అయినా చాలు. అది శాశ్వతంగా ఉంటుంది. 

మోకాలుకే కాదు..

ఏ కారణం వల్ల మోకాళ్ల నొప్పి వచ్చినా పీఆర్‌పీ చికిత్స చేయించుకోవచ్చు. మోకాలితో పాటుగా భుజం కీలు, మోచేయి, కాలి మడమ, పాదాల్లోని కీళ్ల సమస్యలకు కూడా ఈ చికిత్సను వినియోగించుకోవచ్చు.

ఈ జాగ్రత్తలు పాటిస్తే.. 

చికిత్స తరువాత రోగి, డాక్టర్‌ సలహా ప్రకారం దినచర్యను పాటించాలి. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, వంగినప్పుడు, స్నానం చేసేటప్పుడు.. ఇలా వివిధ సమయాల్లో నొప్పి ఏ మేరకు ఉందో ఓమాక్‌ (డబ్ల్యుఓఎంఏసీ) స్కోర్‌ ఆధారంగా అంచనా వేస్తారు. నొప్పి తక్కువ ఉంటే ఈ స్కోరూ తక్కువగా  ఉంటుంది. పేషెంట్‌ సంతృప్తిని బట్టి కూడా నొప్పిని అంచనా చేస్తారు. దీని ప్రకారంగా వ్యాయామాన్ని కూడా సూచిస్తారు. రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. వాకింగ్‌ చేయాలి. కానీ జాగింగ్‌ చేయకూడదు. కింద కూర్చోకూడదు. మోకాలిని 90 డిగ్రీల కన్నా ఎక్కువ వంచకూడదు. బరువులెత్తకూడదు. బండి కిక్‌ కొట్టకూడదు. కాలి క్లచ్‌ వాడకూడదు. సాధ్యమైనంతవరకూ మెట్లు ఎక్కడం, దిగడం మంచిది కాదు. అన్నింటి కన్నా ముఖ్యం.. సాధ్యమైనంత బరువు తగ్గడం. కాలికి దెబ్బలు తగలకుండా జాగ్రత్తపడాలి.

ఎలా చేస్తారు?

సాధారణంగా 1 మి.లీ. రక్తంలో 1.5 లక్షల నుంచి 2-3 లక్షల ప్లేట్‌లెట్లు ఉంటాయి. పీఆర్‌పీ చికిత్స కోసం 20 సీసీల రక్తాన్ని ప్రాసెస్‌ చేస్తే 1 సీసీ రక్తంలో పది లక్షల ప్లేట్‌లెట్లను సేకరించవచ్చు. వీటిని పీఆర్‌పీ థెరపీ కోసం వాడుతారు. ఈ చికిత్స కోసం.. ప్లేట్‌లెట్లు ఎక్కువగా ఉండే ప్లాస్మాను సేకరించడం కీలకమైన ప్రక్రియ. ఇందుకోసం ముందుగా 20 సీసీల రక్తాన్ని ఒక కాట్రిడ్జ్‌లోకి పంపిస్తారు. దీన్ని ‘సెంట్రిఫ్యూజ్‌' చేస్తారు. (ఈ సెంట్రిఫ్యూజన్‌ను సాఫ్ట్‌ స్పిన్‌ అంటారు). ఈ ప్రక్రియ వల్ల ఎర్ర రక్తకణాలు, ప్లాస్మా వేరుపడుతాయి. ఎర్రరక్తకణాలను పక్కకు పెట్టి, ప్లాస్మాను సేకరిస్తారు. దీన్ని మళ్లీ సెంట్రిఫ్యూజ్‌ చేస్తారు. (దీన్ని హార్డ్‌ స్పిన్‌ అంటారు). ఈ సెంట్రిఫ్యూజన్‌ ప్రక్రియలో ప్లాస్మా, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా వేరు అవుతాయి. దీనిలోంచి పీఆర్‌పీని సేకరిస్తారు. ఆ తరువాత ఫ్లోరోస్కోపీ అనే పరికరం సాయంతో లోపం ఉన్న భాగంలోకి పీఆర్‌పీని ఇంజెక్ట్‌ చేస్తారు.  

మోకాళ్ల నొప్పి ఎందుకొస్తుంది?


1. మోకాళ్ల నొప్పికి కార్టిలేజ్‌ అరుగుదల ఒక్కటే కారణం కాదు. మోకాలి కీలు చుట్టూ ఉన్న నిర్మాణాల్లో దేనిలో సమస్య ఉన్నా వస్తుంది. కార్టిలేజ్‌, లిగమెంట్లు, మెనిస్కస్‌, కండరాలు.. ఏవి బలహీనపడినా.. మోకాలి నొప్పి దాడిచేస్తుంది. 

2. కార్టిలేజ్‌ అరుగుదల కాకుండా, బర్సా అనే భాగంలో మంట,వాపు కూడా నొప్పికి కారణం కావచ్చు. ఇది మోకాలి కండరాలు, ఎముకల మీద ఉంటుంది. లూబ్రికేషన్‌ కోసం ఉండే స్పేస్‌ ఇది. వయసు వల్ల బలహీనం అవుతుంది. దీంతో చిన్న దెబ్బలు తగిలినా, డ్యామేజీ కావచ్చు. మోకాలి చుట్టూ ఉండే కండరాలు దెబ్బతినవచ్చు.

3. ఇబ్బందికరమైన భంగిమలో కూర్చున్నప్పుడు కండరాలు, బర్సా లాంటి భాగాలు దెబ్బతినవచ్చు. ఉదాహరణకు, వజ్రాసనంలో ఎక్కువసేపు కూర్చుంటే బర్సా ఇన్‌ఫ్లమేషన్‌ వస్తుంది. బలహీనపడిన కండరాలపై చిన్న ఒత్తిడి పడినా, వాటిపై చిన్నచిన్న పగుళ్లు వస్తాయి. ఈ పగుళ్లని మజిల్‌ ట్రిగర్‌ పాయింట్స్‌ అంటారు. 

4. కండరాల్లో ‘వేర్‌ అండ్‌ టేర్‌ గాయాలు’ కావచ్చు. 

5. వయసుతోపాటు సైనోవియల్‌ ద్రవం తగ్గి, నొప్పి రావచ్చు. ఈ పొరలో వాపు రావచ్చు. 

6. మోకాలి కీలులో ఉండే ఖాళీ ప్రదేశంలోకి నీరు చేరినప్పుడూ నొప్పి వస్తుంది. దీనివల్ల మొత్తం శరీరంలో మంట రావచ్చు. 

7. గాయాలు కూడా మోకాళ్ల నొప్పికి దారితీయవచ్చు. చిన్నవయసులో మోకాలి నొప్పికి కారణం ఇవే. చిన్నవయసు వాళ్లలో క్రీడలు,  రోడ్డు ప్రమాదాల వల్ల.. రెండు రకాలుగానూ గాయాలవుతాయి. 

8. 50 ఏండ్లు దాటినవాళ్లలో అయితే కార్టిలేజ్‌ డీజనరేషన్‌ వల్ల నొప్పి వస్తుంది. కార్టిలేజ్‌ అరిగిపోవడం వల్ల లిగమెంట్లు, కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. బరువువల్ల కలిగే ఒత్తిడంతా వాటిపైనే పడటం ఇందుకు కారణం. ఇలాంటప్పుడు కీలుమార్పిడి ఆపరేషన్‌ చేసినప్పటికీ నొప్పి అలానే ఉండవచ్చు. నొప్పికి సరైన కారణం కనుక్కుంటే తగిన చికిత్స అందించవచ్చు. 

కారణం ఎలా కనిపెట్టాలి?

సాధారణంగా వైద్య పరీక్షల ద్వారానే నొప్పికి కారణం తెలుసుకోగలం. నొప్పి ఎలా మొదలైంది, అరుగుదల ఎలా ఉంది, ఇటీవల దెబ్బలేమైనా తగిలాయా, ఎన్ని రోజుల క్రితం, ఏం చేస్తే నొప్పి వచ్చింది, ఎలా ప్రోగ్రెస్‌ అవుతున్నది.. ఈ విషయాలన్నీ వైద్య పరీక్షల్లోనే తెలుస్తాయి. లిగమెంట్‌, కండరం, కార్టిలేజ్‌, బర్సా, ఫ్లూయిడ్‌... వేటిలో సమస్య ఉందో తెలుస్తుంది. తరువాత ప్రత్యేకమైన స్కాన్‌ చేస్తారు. ముందు వైద్య పరీక్షలో దేనివల్ల సమస్య వచ్చిందో ఒక అవగాహన వస్తుంది కాబట్టి, స్కాన్‌లో దానిపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చు. దీన్ని ఎంఎస్‌కె - మస్కులో స్కెలిటల్‌ స్కాన్‌ అంటారు. ఇది ఎంఆర్‌ఐ కన్నా శక్తిమంతమైంది. టెక్నీషియన్లు కాకుండా ట్రీట్‌మెంట్‌ ఇచ్చే డాక్టరే ఈ స్కాన్‌ చేస్తాడు. దీని వల్ల నొప్పికి మూలం ఎక్కడుందో తెలుస్తుంది. కార్టిలేజ్‌ మందం ఆధారంగా కూడా నొప్పికి గ్రేడింగ్‌ ఇస్తారు. స్కాన్‌తో పాటు మోకాలిని కదిలిస్తూ కూడా నొప్పికి సంబంధించిన అన్ని కోణాలనూ పరిశీలిస్తారు. ఆ తరువాత సమస్య ఉన్నచోట పీఆర్‌పీ ఇంజెక్షన్‌ ఇస్తారు. 


logo