బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - May 25, 2020 , 23:05:15

పొట్టలో గ్యాస్‌ తగ్గేదెలా?

పొట్టలో గ్యాస్‌ తగ్గేదెలా?

నాకు 39 ఏండ్లు. ఎప్పుడూ కడుపుబ్బరంగా ఉంటున్నది. పొట్టలో గ్యాస్‌ ఉన్నట్టే ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా పైల్స్‌ సమస్యతో బాధపడుతున్నాను. మల విసర్జనకి పైల్స్‌ అడ్డుపడుతున్నాయి. దాంతో మలబద్దకం అవుతున్నది. పొట్టలో గ్యాస్‌ ఉండటం వల్లేమో ఆకలి కావట్లేదు.  నాకు సరైన పరిష్కారం తెలుపగలరు. 

- చంద్రశేఖర్‌, ఖమ్మం

మీకు మలబద్దకం ముఖ్య సమస్య. పైల్స్‌ వల్ల మలబద్దకం రాదు.. మలబద్దకం వల్లనే పైల్స్‌ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి మలబద్దకం నుంచి మీరు ముందుగా బయటపడాలి. ఇందుకోసం ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఫైబర్‌ లేకపోతే పేగుల కదలికలు సక్రమంగా ఉండవు. మలవిసర్జన సాఫీగా జరుగదు. విసర్జన క్రియ సరిగా లేకపోయేసరికి కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. మీకు ఎప్పుడూ కడుపుబ్బరంగా ఉంటున్నది. అందుకే మీరు ఆహారంపై శ్రద్ధ పెట్టండి. ఫైబర్‌ కోసం కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. రోజూ పండ్లు తినండి. మలవిసర్జన సాఫీగా సాగడానికి పెగ్‌మూవ్‌ పౌడర్‌ను ప్రతిరోజూ రాత్రి భోజనం తరువాత ఒకగ్లాసు నీటిలో 2 స్పూన్లు కలుపుకొని తాగండి. ఫైబర్‌ వల్ల చాలావరకు సమస్య పోతుంది. దాంతో పైల్స్‌ సమస్య కూడా ఉపశమిస్తుంది. పైల్స్‌ మలవిసర్జనకు అడ్డంగా ఉండదు. అయితే మలద్వారం దగ్గరున్న రక్తనాళాలు ఉబ్బడం వల్లనే పైల్స్‌ ఏర్పడుతాయి. అవి చిట్లిపోయినప్పుడు పైల్స్‌ వల్ల మలంలో రక్తం వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంతమందిలో నొప్పి కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలుంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయినా ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సిందే. 


డాక్టర్‌ కె.ఎస్‌. 

సోమశేఖర్‌ రావు

కన్సల్టెంట్‌ ,గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ 

అండ్‌ హెపటాలజిస్ట్‌, అపోలో హెల్త్‌ సిటీ,హైదరాబాద్‌


logo