శుక్రవారం 04 డిసెంబర్ 2020
Editorial - Oct 23, 2020 , 01:47:48

కేంద్ర బలగాలు అవసరం లేదు

కేంద్ర బలగాలు అవసరం లేదు

పదవ అధ్యాయం కొనసాగింపు...

భూ సేకరణ విషయంలో రిట్‌ పిటిషన్లు పెండింగులో ఉండి,  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నంతకాలం ఏ నిర్మాణ కార్యక్రమమూ శాశ్వతప్రాతిపదికపైగాని, తాత్కాలికంగాగాని చేపట్టకూడదని రాష్ట్రప్రభుత్వం విశ్వసిస్తున్నది. అయితే రామ       భక్తుల ధార్మిక ఆకాంక్షలతో మైత్రిని ప్రకటించేందుకు నిర్మాణ కార్యక్రమంతో సంబంధంలేని కరసేవ నిర్వహించబడుతుంది.

4) మరికొంత సమయం కేటాయిస్తే ఈ సంప్రదింపులు మరింతగా మంచి ఫలితాలను అందించగలవనే విశ్వాసం రాష్ట్రప్రభుత్వానికి ఉన్నది. 5) 2.77 ఎకరాలలోనూ, ఆ చుట్టుపక్కలా ఇంకా పరిస్థితి క్షీణించలేదు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లుగా చూపే దాఖలాలేవీ లేవు. ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగం నుంచి 26-11-1992వ తేదీతో అందిన నివేదిక ప్రకారం అయోధ్యలోకి ఇంకా కరసేవకులు ప్రవేశింపలేదు. కనుక 2.77 ఎకరాల భూమిలోగాని చుట్టుపక్కలగాని జనం గుమిగూడలేదు. కరసేవకు పిలుపునిచ్చిన సందర్భంగా అయోధ్యకు కొత్తగా భవన నిర్మాణ సామాగ్రిగానీ, యంత్రాలుగానీ తరలిరాలేదు.

6)  పరిస్థితిని అదుపులో ఉంచేందుకు సంప్రదింపులు, అనునయపూర్వక చర్యలే ఉత్తమమైన మార్గాలని రాష్ట్రప్రభుత్వం మళ్లీ విన్నవించుకొంటున్నది. 7) ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనను అరికట్టగలిగే దశలోనే ఉన్నది. కనుక కేంద్రం ఇవ్వజూపే బలగాల అవసరం లేదు. ప్రస్తుత యూపీ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో, మరీ ముఖ్యంగా మత సామరస్యాన్ని నిలబెట్టటంలోనూ ఆశించదగిన ప్రమాణాలు కలిగి ఉంది. 8) 1992 జూలైలో కూడా సంప్రదింపులు, అనునయ చర్యలద్వారా 2.77 ఎకరాల స్థలంలో కరసేవను నిలిపివేయగలిగింది.

9) అయోధ్యలో వివాదంలో ఉన్న రామజన్మభూమి కట్టడాన్ని భద్రంగా సంరక్షించే బాధ్యత తనదేనని రాష్ట్రప్రభుత్వం తరచుగా సమీక్షిస్తూ దాని రక్షణకు తగిన చర్యలు గైకొంటూనే ఉంది. వివాదంలో ఉన్న కట్టడ ప్రవేశానికి నిఘా ఉన్నది. ప్రవేశానికి ముందు ప్రతి ఒక్కళ్లనూ తనిఖీ చేయటం జరుగుతున్నది. మెటల్‌ డిటెక్టర్లు, క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టీవీలు వాడబడుతున్నాయి. అవసరమైన చోటల్లా జనాన్ని నిలువరించేందుకు రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయబడినాయి. కట్టడానికి అదనపు రక్షణ కల్పించేందుకూ, శాంతి భద్రతల పరిరక్షణకూ 15 కంపెనీల సాయుధ పోలీసులను అదనపు పోలీసు దళాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 10) ఆ విధంగా రాష్ట్రప్రభుత్వం కేంద్రపు అదనపు బలగాల అవసరం లేకుండానే కట్టడపు రక్షణను నిభాయించగలదు.

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)