Pothana Bhagavatam Episode 114 | ‘గజేంద్ర మోక్షణ’ ఘట్టంలో రససిద్ధుడు పోతన మహాకవి ఎట్టి మహేంద్రజాలం- కనుకట్టు చేశాడో గాని, ఇప్పట్టున తెలుగు అనువాద పద్యాలు తెలుగు హృదయాలు తాకట్టు పెట్టుకొన్నట్లుగ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. హరిరూప శుకుడు పరీక్షిన్నరేంద్రునితో ఇలా పలికాడు.. రాజా! కరిరాజు మకరితో ‘పరి-పరి విధాల పెక్కేండ్లు పోరాడి చివరికి చితికి వేసారి చతికిలపడిపోయాడు. ‘దీనితో సరిసమానంగా పోరి ఓడించి, దీని బారినుంచి బయటపడటం ఇక అడియాసే!’ అని కడుదీనంగా దుఃఖించాడు. ఇంతటి ఆపదలో కూడా పూర్వపుణ్యం వల్ల కలిగిన అపూర్వమైన దివ్యజ్ఞాన సంపద వల్ల తనలో ఇలా అనుకున్నాడు..
శా॥ ‘ఏ రూపంబున దీనిగెల్తు? నిట మీఁదేవేల్పుఁ జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిఁక నివ్వారి ప్రచారోత్తమున్
వారింపం దగువారలెవ్వ? రఖిల వ్యాపార పారాయణుల్
లేరే! మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపం బ్రపుణ్యాత్మకుల్’
ఈ మొసలిని ఎలా గెలిచేది? ఇకపై అసలు ఏ దేవుని కొలిచేది? ఎవరిని పిలిచేది? కాపాడే వారెవరు? దొడ్డదైన ఈ బహుచెడ్డ మొసలిని అడ్డుకుని నన్ను ఒడ్డున పడేసే వారెవ్వరు? పెక్కురు పురుషార్థపరులు, పుణ్యాత్ములలో ఈ వన్యప్రాణి దిక్కుమాలిన మొర ఆలకించే ధన్యజీవులు ఒక్కరు కూడా లేరా?
శా॥‘నానానేక పయూథముల్ వనము లోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్ఛాయలం దుండ లే
కీ నీరాశ నిటేల వచ్చితి? భయం బెట్లోకదే ఈశ్వరా!
అడవిలో చిరకాలంగా పెక్కు గజ సమూహాలు నన్ను మహారాజుగా మన్నిస్తుండగా, పదిలక్షల కోట్ల ఆడ ఏనుగుల యూథానికి (గుంపునకు) నాథుడనై ఉండి, నా దాన(మద) జలధారలతో పుష్టి-ఏపుగా పెరిగిన చందనపు చెట్లు, తీగల పొదరిండ్ల చల్లని ఛాయ (నీడ)లలో ఉల్లసితం (ఆనందం)గా ఉండక నీటిపై ఆశతో ఇచ్చోటికి ఎందుకొచ్చాను? భగవంతుడా! భయం-భయంగా ఉంది. నాకీ చేటు తప్పేదెలా?
ఆపదలు మనుషులకు ఒకరకం, పశువులకు మరోరకం కాదు గదా! గజేంద్రుడు శాయశక్తులా పెనుగులాడినా పురుషకారం చాలలేదు. దేహబలంతో సాధ్యం కానిది దైవబలంతో తప్పక సాధించవచ్చన్న భావం మత్తేభరాజు మనసులో మెరుపులా మెరిసింది. ‘ఆర్తత్రాణ పరాయణస్స భగవాన్ నారాయణో మే గతిః- ఆర్త రక్షణ తత్పరుడు, ఆపద్బాంధవుడు అచ్యుత భగవానుడే నాకు దిక్కు’ అన్న అమోఘమైన జ్ఞానం ఆవిర్భవించింది. ఇది గతజన్మల సత్కర్మల వితతి (రాశి)కి అతి ఉత్తమమైన ప్రతిఫలం! వనంలో, రణంలో, శత్రుమధ్యంలో, జలంలో, దావానలం (కార్చిచ్చు)లో, కడలి నడుమ గానీ, కొండ శిఖరం మీదగానీ ఎక్కడైనా, ఎలాగైనా- నిద్రలోనో, అభద్రమైన అజాగ్రత్తగనో, విషమావస్థలోనో, ఎట్టి పరిస్థితిలో ఉన్నా , పూర్వపుణ్యమనేది ఉంటే, అది గట్టిగా కాపాడుతుంది. కనువిందైన అందం, అందలం ఎక్కి కూర్చున్న కులం, శీలం, విద్య, శ్రమకోర్చి చేసిన సేవలు- ఇవేవీ ఫలించవు. సమయం (రుతువు) రాగానే ఫలించే వృక్షాల వలె పూర్వం కూడబెట్టుకున్న పుణ్యాలే ఫలవంతాలై అనంత భోగభాగ్యాలను అందిస్తాయి. పూర్వపుణ్య విశేషం వలన గజరాజుకు గతజన్మలో గురువు ఉపదేశించిన స్తుతి- మాలామంత్రం, మతికి (గుర్తు) వచ్చింది. మత్తేభపతి- గజరాజు, ఆర్తితో మంత్రం జపిస్తూ, అది ప్రతిపాదించే దేవతామూర్తిని ధ్యానింప పూనుకున్నాడు. గజేంద్రుడు పశువు కదా! స్తుతించడానికి వానికి నోరెక్కడుంది? కనుకనే భాగతవం ‘జజాప పరమం జప్యం’- పరమమైన మానస జపం చేశాడని పేర్కొంది.
ఉ॥‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై
యెవ్వని యందు డిందుఁ బరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వఁడనాది మధ్యలయుఁ డెవ్వఁడు సర్వముఁ దానయైన వా
డెవ్వఁడు వాని నాత్మభవునీశ్వరు నే శరణంబు వేఁడెదన్’
కరీంద్రుడు సంయమీంద్రుడై ఇలా స్తుతించాడు..
‘ఈ జగత్తు ఎవనివలన జన్మిస్తున్నదో, ఎవనిలో లీనమై అనగా కలిసే ఉంటుందో, చివరికి ఎవనిలో లయం చెందుతుందో, ఎవరు పరమేశ్వరుడో- జగత్తుకు ఏకైక ప్రభువో, ఎవడీ విశ్వానికి మూలకారణమో- సర్వకారణాలకు తానే కారణమై తనకు ఇతర కారణం లేనివాడో ఎవడు ఆది (మొదలు), మధ్య, తుది అనేది లేనివాడో, ఎవడు అంతా తానే అయి అంతటా ఉన్నాడో, అట్టి తనంతట తాను ఉద్భవించిన- స్వయంభువు, ఈశ్వరుని మాత్రమే నేను శరణు వేడుతున్నా’.
తరతరాలుగా, మన తరంలో కూడా చాలామందికి అనితరంగా, వరంగా నోటికి వచ్చిన పద్యం పై ఉత్పలమాల! ‘యతోవా ఇమాని భూతాని జాయన్తే యేన జాతాని జీవన్తి యత్ప్రయన్త్యభిసంవిశన్తి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి’ అనే తైత్తిరీయ ఉపనిషత్ మంత్రానికి ఇది వ్యాఖ్యాన రూపం. పరబ్రహ్మ సంబంధమైన అష్టవిధ లక్షణాలను ఎంతో ఇష్టమైన విధంగా స్పష్టం చేసే విశిష్టమైన వృత్తం ఈ అష్టదళ చెంగల్వపూదండ- ఉత్పలమాల. పరమాత్మ అనగా ఎట్టివాడు? అన్న ప్రశ్నకు తెలుగన్న వచసా- నోటి నుంచి, తడుముకోకుండా ఎంతో భరోసాగా వచ్చే మిన్న అయిన సమాధానమే వెన్నవంటి మృదు మధురమైన మన ఈ పోతన్న పద్యం!
‘ఈశ్వరు నే శరణంబు వేడెదన్’- వేదసారం ఉపనిషత్తులు. ఉపనిషత్ సారం బాదరాయణుడు కూర్చిన భగవద్గీత. గీతాసారం- సర్వసాధనలకు చరమ (అంతిమ) పరిణతి అయిన శరణాగతి! ‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ’– సర్వధర్మ పరిత్యాగానికి, స్వామి శరణాగతి స్వీకరణకు- రెంటికీ ప్రేరకుడు పరమాత్మే! భగవత్ ప్రాప్తికి భగవంతుడే ఉపాయం! ఉపాయం- సాధనా తానే, ఉపేయం- సిద్ధీ తానే! ఇదే శరణాగతి తత్తం.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 98668 36006
“Pothana Bhagavatam Episode 113 | కథ ఏనుగుది-వ్యథ జీవునిది!”