శుక్రవారం 22 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 13:27:48

భార్య‌ను చంపి వీడియో గేమ్‌లో మునిగిపోయిన భ‌ర్త‌

భార్య‌ను చంపి వీడియో గేమ్‌లో మునిగిపోయిన భ‌ర్త‌

జైపూర్ : ఓ భ‌ర్త త‌న భార్య‌ను క‌త్తెర‌తో పొడిచి చంపి వీడియో గేమ్‌లో మునిగిపోయాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ జోధ్‌పూర్‌లోని బీజేఎస్ కాల‌నీలో సోమ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. బీజేఎస్ కాల‌నీకి చెందిన విక్ర‌మ్ సింగ్‌(35), శివ్ కున్వార్‌(30)కు కొన్నేళ్ల క్రితం వివాహ‌మైంది. అయితే విక్ర‌మ్ జాబ్ చేయ‌కుండా ఇంట్లోనే ఉంటున్నాడు. కున్వార్ ఇంట్లోనే కుట్టు మిష‌న్ ప‌ని చేస్తోంది. దీంతో ఆర్థిక ఇబ్బందుల‌పై భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం రాత్రి కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. ఆగ్ర‌హంతో ఊగిపోయిన విక్ర‌మ్ సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ త‌న భార్య‌ను క‌త్తెర‌తో పొడిచి చంపాడు. భార్య మృత‌దేహం ప‌క్క‌నే కూర్చున్న విక్ర‌మ్.. త‌న ఫోన్‌లో వీడియో గేమ్ ఆడుతూ ఆ ఆట‌లో మునిగిపోయాడు. కున్వార్ హ‌త్య‌కు గురైన విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు చేర‌వేశారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు కున్వార్‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. విక్ర‌మ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  


logo