Telangana | కేవలం వంద రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేకపోయిందని మండిపడ్డారు. నాగర్‌కర్నూలు బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపైవిమర్శలు గుప్పించారు. ప్రచారం మాత్రం ఆర్భాటంగా చేస్తున్నారని.. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని అన్నారు.
దేశంలో మోదీ గాలి వీస్తోందని భూపేంద్ర పటేల్ అన్నారు. ఈ సారి 400 సీట్లకు పైగా సాధించి మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే భారత దేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి.. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గొప్ప నాయకుడు అని అభివర్ణించారు. దేశ వికాసానికి బీజేపీ ఒక్కటే ప్రామాణికమని.. దానికి ప్రధానిగా మోదీ మాత్రమే అర్హుడని అన్నారు.