బాల్యం నుంచీ అన్ని రకాలుగా అండగా నిలిచిన తన తల్లే.. తనకు స్ఫూర్తి అని చెబుతున్నది రకుల్‌ప్రీత్ సింగ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తాజాగా, ఓ జాతీయ మీడియాతో మాట్లాడింది. జీవితంలో తనకు ప్రేరణగా నిలిచిన మహిళల గురించి ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. నేటితరం మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారనీ, ప్రతిరంగంలోనూ బలమైన ప్రభావాన్ని చూపుతున్నారనీ పేర్కొన్నది. “మన చుట్టూ ఉన్న మహిళలను అభినందించడం, వారి విజయాలను గుర్తించడం, వారి కలలకు మద్దతుతోపాటు బలాన్ని కూడా అందివ్వడమే.. మహిళా దినోత్సవ ఉద్దేశం” అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నది. ఇక స్ఫూర్తిదాయకమైన మహిళలతో సమయం గడపడమే తనకు అత్యంత ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటని వెల్లడించింది.
ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తన తల్లే తనకు ప్రేరణ అని చెప్పుకొచ్చింది. “మా అమ్మే నాకు స్ఫూర్తి. నా బలం. ఆమే నాకు అతిపెద్ద ప్రేరణ. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూలంగా ఉండటాన్ని మాకు బాల్యం నుంచే నేర్పించింది” అంటూ తల్లి గురించి తెలియజేసింది. ఆమెవల్లే ఈరోజు తాను ఈస్థితిలో ఉన్నాననీ వెల్లడించింది. “మా అమ్మ చిన్నప్పటి నుంచే నాకు కష్టపడి పనిచేయడం, నన్ను నేను నమ్ముకోవడం నేర్పింది. ఎల్లప్పుడూ నాపై ఎంతో నమ్మకం ఉంచేది. నేను కూడా ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నా! ఇక మా అమ్మ ప్రతి బాధ్యతనూ ఎంతో దయతో నిర్వహించేది. అందుకే.. ఎన్నో విషయాల్లో నాకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది” అంటూ చెప్పుకొచ్చింది.